బెజవాడలో వరుస చోరీలు బెంబేలెత్తిస్తున్నాయి.. అయితే ఈ చోరీల్లో ఓ ప్రేమ దొరకడం సంచలనంగా మారింది. వీళ్లు మామూలోళ్లు కాదు.. దొంగలుగా మారిన ప్రేమజంట.. అని పోలీసులు వెల్లడించారు. చెడు వ్యసనాలకి బానిసైన ఓ ప్రేమ జంట సులువుగా డబ్బులు సంపాదించడం కోసం కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభించారు.. గంజాయికి బానిసై పని పాట లేక తిరుగుతూ పగలు రెక్కీలు నిర్వహిస్తూ, రాత్రులు దొంగతనాలకు పాల్పడుతున్నారు.. ఈ దొంగలిద్దరూ కలిసి బెజవాడలో చేసిన వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఇంటి యజమాని తన గేటుకు కట్టేసిన కుక్కపిల్ల పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పెద్ద దొంగతనాలనే పట్టించుకోని ఈ రోజుల్లో కుక్కపిల్ల పోయిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారెక్కడ అని.. పోలీసులు కూడా కుక్క పిల్లలే అని లైట్ తీసుకున్నారు.. ఈలోపే అదే వీధిలో మరో ఇంట్లో పడి బంగారం మొత్తం దోచుకున్నారు అదే దొంగలు.. సీసీ కెమెరాలో జరిగిందంతా చూసి దొంగలు ప్రేమికులను తెలిసి పోలీసులే కంగుతిన్నారు..
విజయవాడ పడమట న్యూ ఆర్టీసీ కాలనీ చెందిన ఓ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడి బీరువాతాళాలు పగలగొట్టి 250 గ్రాములు బంగారంతో పాటు నగదును దోచుకెళ్ళారు. దొంగలు దోచుకున్నట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఉదయం రెక్కి నిర్వహించిన ప్రేమ జంట అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.
అయితే.. బంగారం, నగదు చోరీ చేసిన దొంగలే దానికి ముందు రోజు మరో ఇంట్లో కుక్కపిల్ల పోయిందని ఫిర్యాదు చేసిన యజమాని కుక్కను దొంగిలించినట్లు కూడా గుర్తించారు. రెండిళ్లలో ఇంట్లో అందరూ ఉండగానే దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ కిలాడి ప్రేమ జంట పక్కా ప్లాన్ వేసి పథకం ప్రకారం అర్ధరాత్రి చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల పేరెంట్స్ వద్ద దోచుకున్న సొమ్మును రికవరీ చేసి పరారీలో ఉన్న ప్రేమ జంట కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.