ఆంధ్రా ఊటీకి పోటెత్తుతున్నారు పర్యాటకులు. సీజన్ పీక్‌కు చేరడంతో వంజంగి హిల్స్‌లో సూర్యోదయం సందర్శకులను కట్టిపడేస్తోంది. పచ్చని కొండల మధ్య తేలియాడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా అరకు వెళ్లాలనుకునే పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అదెంటో తెల్సా…
మన్యంలో ప్రకృతి పరవశిస్తోంది. అరకు అందాలు కనువిందు చేస్తున్నాయి. వెండిమబ్బులు గాల్లో తేలుతున్న అక్కడి ఆహ్లాదకర వాతావరణం, అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. అరకు లోయతో పాటు లంబసింగి, వంజంగిలోని ఈ మేఘాల కొండలు మైమరిపిస్తున్నాయి. ఆకాశమే దిగివచ్చిందా అన్నట్లు ఈ అద్భుత దృశ్యాలు ఔరా అనిపిస్తున్నాయి. అరకులో ఉన్నామా… ఆకాశంలో విహరిస్తున్నామా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. అరకు అందాలు .. సుందర దృశ్యాలకు చూసేందుకు రెండు కళ్లు చాలట్లేదంటున్నారు. సంవత్సరం ముగింపు, మంచు సీజన్ కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాదు… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులతో అరకు కళకళ లాడుతోంది. బొర్రా గుహలు, అరకులోయ, వంజంగి మేఘాలకొండ, జలపాతాలు, తాజంగి, లంబసింగి వంటి ప్రదేశాలు పర్యాటలకులను కట్టిపడేస్తున్నాయి. ఇక్కడున్న సుందరమైన, ప్రకృతిసిద్ధ అందాలు, జలపాతాలు, ఇతర ప్రదేశాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మాహారాష్ట్ర నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రకృతి అందాలను కెమెరాల్లో, మొబైల్ ఫోన్లలో బంధిస్తూ.. ఆనంద పరవశ్యంలో మునిగి తేలుతున్నారు.
మరోవైపు అరకు టూరిస్టులకు తూర్పు కోస్తా రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ నుంచి స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 19 వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8:30 గంటలకు విశాఖలో ట్రైన్ బయల్దేరి ఉదయం 11:45 గంటలకు అరకు చేరుకోనున్నట్లు తెలిపారు. రిటన్ జర్నీలో అదే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరి సాయంత్రం 6 గంటలకు వైజాగ్ చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్, 2 జనరల్ కమ్ లగేజీ బోగీలతో ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా కేవ్స్ మీదుగా రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. టూరిస్టులకు గమనించి ఈ ట్రైన్ సర్వీసు వినియోగించుకోవాలని కె.సందీప్ సూచించారు.