విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి పార్టీ కైవసం చేసుకుంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన 74మంది ఓటేశారు. కోరమ్ సరిపోవడంతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.. అయితే.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. కాగా.. రేపు కూటమి కార్పొరేటర్లు మేయర్‌ను ఎన్నుకోనున్నారు.
విశాఖ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ నిర్వహించారు అధికారులు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో.. ఎమ్మెల్యే వంశీ కృష్ణ రాజీనామాతో 21వ డివిజన్ స్థానం ఖాళీ అయింది. దీంతో 97 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యులైన ప్రజా ప్రతినిధులు 16 మంది ఉండగా వారిలో 11 మంది బలం కూటమికే ఉంది. ప్రస్తుతం టీడీపీకి 48 మంది కార్పొరేటర్లు, జనసేనకు 14 మంది కార్పొరేటర్లు, బీజేపీకి ఇద్దరు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి కూటమికి 75 వరకు సంఖ్యా బలం ఉంది. ఈ క్రమంలో కూటమి క్యాంప్ నుంచి ఒక కార్పొరేటర్ మిస్సింగ్ కలకలం రేపింది. మలేషియా నుంచి వస్తుండగా భూపతిరాజు సుజాత మిస్ అయ్యారు. వైసీపీ ఆపరేషన్‌తోనే కార్పొరేటర్ కనిపించకుండా పోయినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో విశాఖలోనే మకాం వేసిన మంత్రులు డోలా, అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ఎంపీ భరత్ కూడా చివరి నిమిషంలో ఎలాంటి ట్విస్ట్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.