పైకేమో అవి మసాజ్ సెంటర్లు.. లోపల జరిగే యవ్వారమే వేరు. స్పా పేరుతో నిర్వహిస్తూ అమ్మాయిలతో అట్రాక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్తే చాలు వలపు వలలో మిమ్మల్ని ఊరిస్తూ ఉంటారు. కాస్త కమిట్ అయితే సర్వసుఖాలు ఉంటాయని ఆఫర్ చేస్తారు. తాజాగా పోలీసుల దాడుల్లో.. ఓ స్పా సెంటర్ చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎంత నిఘా పెడుతున్న.. గుట్టు చప్పుడు కాకుండా ఆ గలీజు దందా సాగిపోతుంది..! స్పా ముసుగులో ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కనీసం అనుమతులు కూడా తీసుకోకుండా వీటిని నిర్వహిస్తున్నట్టు ఇటీవల తనిఖీల్లో బయటపడ్డాయి…
వైజాగ్‌లో ఇటీవల కాలంలో పోలీసులు మెరుపు దాడులు చేస్తున్నారు. అయితే.. ఈ చీకటి కార్యకలాపాలు కాస్త తగినట్టు అనిపించినా.. గుట్టుగా మరికొంతమంది అనైతిక కార్యకలాపాలకు స్పా సెంటర్లను అడ్డాలుగా మార్చేస్తున్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు కీలక సమాచారం అందడంతో.. రామ్ నగర్‌లోని మినీ థాయ్ స్పా లో మెరుపుదాడులు చేశారు. స్పా మాటున సాగిపోతున్న చీకటి కార్యకలాపాల వ్యవహారం బయటపెట్టారు. అయిదుగురు యువతులను రెస్క్యూ చేసిన పోలీసులు.. నిర్వాహకుడు రమేష్, మరో నలుగురు విటులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ వెస్ట్ బెంగాల్ యూపీ నుంచి ముగ్గురు యువతులు, రాజమండ్రి విజయవాడ నుంచి మరో ఇద్దరు యువతలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తున్నట్టు గుర్తించారు. మసాజ్ కోసం వచ్చేవారికి యువతులతో ఎర వేసి ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. స్పా సెంటర్ సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
వాస్తవానికి మసాజ్ సెంటర్లు, స్పాలు నిబంధన ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. శారీరక మానసిక ఒత్తిళ్ళ నుంచి ఉపశమనం పొందేందుకు శాస్త్రీయమైన పద్ధతిలో కార్యకలాపాలు జరగాలి. కానీ.. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెట్రో సిటీస్‌లో ఆయా కేంద్రాలకు అర్థమే మారిపోతుంది. మసాజ్ సెంటర్లు అనగానే.. మానసిక శారీరక ప్రశాంతత మాట పక్కనపడితే.. చీకటి కార్యకలాపాలు జరిగే డెన్ లుగా పేరుగాంచాయి. ఎందుకంటే.. చాలా సందర్భాల్లో తనిఖీల్లో బయటపడిన వ్యవహారాలు అలాంటివి మరి. మెట్రో నగరాల్లో అయితే.. మసాజ్ సెంటర్లు, ముసుగులో.. విచ్చలవిడిగా అనైతిక వ్యవహారాలు జరుగుతాయి. విశాఖలోనూ పోలీసులు ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో చీకటి యవ్వరాలు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో నిర్వాహకులను అరెస్ట్ చేసి.. మహిళలు యువతులను రెస్క్యూ చేశారు. నిబంధనలను పాటించని వారికి వార్నింగ్ ఇస్తూ నోటీసులు కూడా జారీ చేశారు. అయినా తీరు మారడం లేదు.