టాలీవుడ్ ప్రముఖ తెలుగు నటుడు, కామెడీ విలన్ ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఫిష్ వెంకట్ బోడుప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.
తనదైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్ పై వెంకట్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. గత కొన్నేళ్లుగా డయాలసిస్ చేయిస్తున్నా ఇప్పుడు నటుడి పరిస్థితి మరింత విషమించిందని, అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయడం తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న వారు వెంకట్ చికిత్స కోసం సాయం చేయాలని దాతలను చేతులెత్తి మొక్కుతున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు కనీసం రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని, తమ వద్ద అంత డబ్బు లేదని, సినీ ప్రముఖులు, దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కుమార్తె స్రవంతి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో ఫిష్ వెంకట్ కు అండగా నిలిచారు. చికిత్స కోసం రూ. 2లక్షలను పంపించారు. ఈ మేరకు చెక్కును తన టీమ్ ద్వారా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వక్ చాలా మంచి పని చేశాడని, మిగతా హీరోలు కూడా వెంకట్ కు సాయం చేయాలని సినీ అభిమానులు, నెటిజన్లు కోరుతున్నారు.
ఫిష్ వెంకట్ కు తోడుగా గబ్బర్ సింగ్ గ్యాంగ్
కాగా ఫిష్ వెంకట్ కు గబ్బర్ సింగ్ గ్యాంగ్ అండగా నిలిచింది. తమ తోటి నటుడికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే రూ. 2 లక్షల చెక్కును పంపిన హీరో విశ్వక్ సేన్ కు గబ్బర్ సింగ్ గ్యాంగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అంతకు ముందు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం (జులై 07) ఆసుపత్రికి వెళ్లి ఫిష్ వెంకట్ ను పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న నటుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. . ఫిష్ వెంకట్ చికిత్సకు తన వంతు సహాయంతో పాటు ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.