రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్‌కు కళ్లెం వేసేందుకు పోలీసులు సరికొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు. క్రైమ్ జరగకుండా ముందుస్తు నిఘా పెట్టడంతో పాటు పొరపాటున జరిగితే క్షణాల్లో నిందితులను పట్టుకునేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీతో విజయనగరం టూ టౌన్ పోలీసులు చేపట్టిన విధానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర పోలీస్ స్టేషన్లకి రోల్ మోడల్ గా మారింది. ఇదే విధానాన్ని ఇతర పోలీస్ స్టేషన్లకి కూడా అమలుచేసే యోచనలో ఉన్నారు ఆయా జిల్లాల పోలీస్ బాసులు.
ఇటీవల కాలంలో క్రైమ్ పోకడ పెరిగింది. మహిళలపై దాడులు, చైన్ స్నాచింగ్, ఇళ్లలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. పలుచోట్ల మహిళలపై నిఘా పెట్టి మరీ దాడులకు పాల్పడుతున్నారు దుండగులు. వృద్ధులు, మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య మరింతగా పెరిగింది. జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో చైన్ స్నాచింగ్, గంజాయి సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. ఇలాంటి ఘటనలు సాధ్యమైన వరకు కట్టడి చేయాలని యోచించారు విజయనగరం టూ టౌన్ పోలీసులు. టెక్నాలజీ తో క్రైమ్ కంట్రోల్ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముందుగా టూ టౌన్ పరిధిలో ఉన్న వీధులు, అపార్ట్మెంట్లు, ముఖ్యమైన జంక్షన్లలలో పబ్లిక్‌తో సమావేశం అయ్యారు. వారిని మోటివేట్ చేసి ఆ ప్రాంతమంతా పబ్లిక్ సహకారంతో సిసి కెమెరాలు పెట్టుకునేలా ప్రోత్సహించారు. సీసీ కెమెరాలు కూడా హైటెక్నాలజీతో పాటు ఆడియో, వీడియో క్లారిటీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
టూ టౌన్ పరిధిలో ప్రతిచోట సీసీ కెమెరాలు పెట్టి అక్కడి నుండి నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌లో పర్యవేక్షించేలా కంట్రోల్ రూమ్‌కు సీసీ కెమెరాలు అనుసంధానం చేశారు. అలా దాదాపు టూ టౌన్ లిమిట్స్ అంతా కూడా సీసీ కెమెరాలతో కవర్ చేశారు. అలా సీసీ కెమెరాల ద్వారా టూ టౌన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ నిరంతరం కమాండ్ కంట్రోల్ రూం లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా అనుమానస్పదంగా వాహనాలు కనిపించినా, అనుమానిత వ్యక్తులు కనిపించినా వెంటనే అప్రదేశానికి కానిస్టేబుల్స్ పంపించి విచారిస్తున్నారు. అంతేకాకుండా టూ టౌన్ పరిధి అంతా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉందని సస్పెక్ట్ సీట్స్ ఉన్నవారికి, పాత నేరస్తులకు, రౌడీషీటర్స్‌కు తెలియజేస్తున్నారు. ఎవరైనా నేరం చేస్తే వెంటనే దొరికిపోతారు, నిరంతరం పోలీస్ వారు పర్యవేక్షిస్తున్నారు అనే సందేశాన్ని ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు నేరగాళ్లు నేరాలు చేయడానికి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సీసీ కెమెరాలు పెట్టిన తరువాత టూ టౌన్ పరిధిలో నేరాలు గణనీయంగా తగ్గాయని చెప్తున్నారు పోలీసులు.
అంతేకాకుండా మరోవైపు డ్రోన్లను కూడా నిరంతరం వినియోగిస్తున్నారు. వీటి సహాయంతో ఏ మారుమూల ప్రాంతమైనా, ఎలాంటి నేరాలు జరిగినా చిటికెలో పట్టేస్తున్నారు. డ్రోన్ల సహాయంతో నేరస్తులను పట్టుకోవడం ఇప్పడు సంచలనంగా మారింది. ఇలా టెక్నాలజీని వినియోగిస్తూ నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు పోలీసులు.