బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. అల్పపీడనం బలహీనపడిందని.. దీని ప్రభావతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం తూర్పు తెలంగాణ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది.. సముద్రమట్టం నుండి 3.1 కి మీ ఎత్తువరకు కొనసాగుతూ.. ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకి వాలి ఉందని పేర్కొంది..
వీటి ప్రభావంతో తెలంగాణలో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. బుధవారం సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
మంగళవారం, బుధవారం తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలోని వచ్చే నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.