తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపించడం లేదు. అరకోర జల్లులు మినహా భారీ వానలకు అనుకూల వాతావరణం కానరావడం లేదు. మరోవైపు ఆగ్నేయ దిక్కులో ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి జార్ఖండ్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూలైలోనూ రాష్ట్రంలోని దాదాపు15 జిల్లాల పరిధిలోని 311 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతుంది.
ఏపీకి వరద ముప్పు.. అప్రమత్తమైన అధికారులు..
దక్షిణాదిన వర్షాలు లేకపోయినా.. ఉత్తరాదిన వానలు ఊపేస్తున్నాయి. దీంతో దేశ ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. వరద ప్రమాదం ఉందని, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ఏర్పాటు చేసింది.
బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని సూచించింది. పోలవరం స్పిల్‌వే ఎగువన 30.11, దిగువన 20.87 మీటర్ల నీటిమట్టం పెరిగింది. పోలవరం 48 గేట్ల ద్వారా 5,02,478 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. నిన్న రాత్రికి శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,77,873 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,68,868 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరింది. శ్రీశైలం మూడు గేట్లు ఎత్తి 81,333 క్యూసెక్కులు సాగర్‌కు నీళ్లు విడుదల చేశారు.