ఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎవరిది? టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెబుతోంది..?

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే పలువురు రాజకీయ నేతల వాంగ్మూలం తీసుకున్నా పోలీసులు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్ గురించి చర్చ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది రాజకీయ నాయకులను మొదలుకుని జర్నలిస్టులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను సైతం టాప్ చేశారంటూ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అసలు నిజంగానే ఇంతమంది ఫోన్లను టాప్ చేసే అధికారం ప్రత్యేక అధికారులకు ఉంటుందా..? ఎవరి అనుమతులు తీసుకొని ఇంత మంది ఫోన్లను ట్యాప్ చేశారు..? అసలు రాష్ట్రంలో సగటు వ్యక్తి ఫోన్ ను టాప్ చేయాలంటే ఇంత సులువుగా చేయొచ్చా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మొన్నటి వరకు అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధా కిషన్ రావు, అందరూ కూడా ప్రభాకర్ రావు చెబితేనే తాము ఇదంతా చేశామని చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు రానే వచ్చాడు. కానీ ప్రభాకర్ రావు కూడా తన పైఅధికారులు చెప్పినట్లే చేశానంటూ.. మరొకరి మీదికి టాపింగ్ వ్యవహారాన్ని నెట్టేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ అధికారం ఎవరికి ఉంటుంది..?

రాష్ట్ర పరిధిలో ఫోన్ టాపింగ్ చేయాలి అంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం నిబంధనలకు లోబడి చేయవచ్చు. టెలిగ్రాఫ్ యాక్ట్ 419A. ప్రకారం దేశ భద్రతకు ఆటంకం కలిగించే సందర్భాల్లో వారి ఫోన్లను ట్యాప్ చేయవచ్చు. ప్రజల భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో ఆటంకం కలిగించే వ్యక్తుల ఫోన్లను టాప్ చేయవచ్చు. ఇలాంటి ప్రమాదక సందర్భాల్లో కూడా ఒక ఫోన్ నెంబర్‌ను టాప్ చేయాలి అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 419A ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు లేకుండా ఫోన్ టాపింగ్ జరగడం అసాధ్యం. తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో సర్వీస్ ప్రొవైడర్ల నుండి వచ్చిన డేటా ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. అసలు సర్వీస్ ప్రొవైడర్లకి ఏ స్థాయి అధికారులు చెబితే ఫోన్లను టాప్ చేశారో టీవీ9 మీకు క్లియర్ గా వివరిస్తుంది.

రాష్ట పరిధిలో మూడు లేయర్లలో ఫోన్ టాపింగ్ కి సంబంధించిన అనుమతులు తీసుకోవాలి..

* డిసిగ్నేటెడ్ అథారిటీ

* కాంపిటంట్ అథారిటీ

* రివ్యూ కమిటీ

డిసిగ్నేటెడ్ అథారిటీ – ఇంటెలిజెన్స్ చీఫ్, SIB చీఫ్, CI సెల్ చీఫ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాంపిటంట్ అథారిటీ – రాష్ట హోం శాఖ సెక్రెటరీ, రివ్యూ కమిటీ – చీఫ్ సెక్రటరీ, లా సెక్రటరీ, ప్రభుత్వ కార్యదర్శి ఉంటారు. ఈ మూడు లేయర్ల వారిగా రాష్ట్రంలో ఫోన్ టైపింగ్ జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అంటే ఏదైనా ఎమర్జెన్సీ టైంలో డెసిగ్నేటెడ్ అథారిటీగా ఉన్న ప్రభాకర్ రావ్ ఫోన్లను ట్యాప్ చేయవచ్చు. ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ అధికారులు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్ నెంబర్లను లేదా ఈమెయిల్ ఐడీలను పంపించి ట్యాప్ చేయమని ఆదేశాలు ఇస్తారు.

అయితే ఎవరి ఫోన్ నెంబర్లను టాప్ చేస్తున్నారో ఆ వివరాలను కాంపిటేంట్ అథారిటీకి అంటే రాష్ట్ర హోం సెక్రటరీకి మూడు రోజూలో ఇంటెలిజెన్స్ చీఫ్, SIB చీఫ్ తెలపాలి. ఆ ఫోన్ నెంబర్లను పరిశీలించి దాని వెనక పర్యవసానాలు గమనించి వారి వల్ల దేశ భద్రతకు గానీ ప్రజల భద్రతకు గానీ ఎంతవరకు హానికరమో తెలుసుకొని తిరిగి ఏడు రోజుల్లోపు హోం సెక్రటరీ అనుమతులు ఇస్తూ డెసిగ్నేటెడ్ అధికారికి ట్యాప్ చేయమని ఆదేశాలు ఇస్తారు .

అయితే ఇప్పుడు జరుగుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారంలో డిసిగ్నేటెడ్ అధికారిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రజల భద్రతకు హాని కలిగించే మావోయిస్టుల నంబర్లను టాప్ చేస్తున్నామని చెప్పి అధికారులను మభ్యపెట్టి మావోయిస్టుల నంబర్లకు బదులు రాజకీయ నాయకులు, జర్నలిస్టు, హైకోర్టు జడ్జీల ఫోన్ నెంబర్లను పొందపరచి కాంపిటంట్ అధికారిగా ఉన్న హోంశాఖ సెక్రటరీకి పంపించి టాపింగ్ అనుమతులు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రభాకర్ రావు ఏ ఫోన్ నెంబర్లను అయితే ట్యాప్ చేస్తున్నారో మూడు రోజుల్లో ఆ ఫోన్ నెంబర్లతో పాటు వివరాలను హోం శాఖకు పంపించాల్సి ఉంటుంది. ఏడు రోజుల్లోపు హోం శాఖ వీటిని పరిశీలించి అనుమతులు ఇస్తుంది. ఒకవేళ ఏడు రోజుల్లోపు హోం శాఖ నుండి డిసిగ్నేటెడ్ అధికారైనా ప్రభాకర్ రావుకు ఎలాంటి సమాచారం రాకపోతే తక్షణమే ఆ ఫోన్ నెంబర్ను టాప్ చేయడం నిలిపివేయాలి. ఇక ముందు ఆ ఫోన్ నెంబర్‌ను ట్యాప్ చేయాలి అనుకుంటే హోం సెక్రటరీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

ఇక రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి, లా సెక్రటరీ ప్రతి రెండు నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ సమావేశం జరగాలి. లీగల్ టాపింగ్ కు సంబంధించి నిబంధనలకు లోబడి జరుగుతుందా లేదా అనేది ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై చర్చించాలి. సక్రమంగా నిబంధనలకు లోబడి జరుగుతున్న టాపింగ్ వివరాలను పరిశీలించి 6 నెలలకు మించి ఆ నంబర్‌ను టాప్ చేయకుండా చూడాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నంబర్‌ను మళ్లీ టాప్ చేయాలి అనుకుంటే మూడు నెలలకు మించి ఒక ఫోన్ నెంబర్‌ను ట్యాప్ చేయకూడదు. టెలిగ్రాఫ్ చట్టంలోని 419A సబ్ క్లాస్ 17 ప్రకారం ప్రజల భద్రతకు హాని కలిగించే వారి ఫోన్లను మాత్రమే టాప్ చేయాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 ప్రకారం ప్రజల భద్రతకు హాని కలిగించే వారి ఫోన్లను ట్యాప్ చేయడం టెలిగ్రాఫ్ చట్టంలోని రూల్స్ లో భాగమే. ఒకవేళ టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనను ఉల్లంఘించి టాపింగ్ జరుగుతున్నట్లు రివ్యూ కమిటీ గుర్తిస్తే తక్షణమే వాటిని నిరోధించవచ్చు. ట్యాపింగ్ చేసిన డేటా మొత్తాన్ని ధ్వంసం చేయమని రివ్యూ కమిటీ ఆదేశించవచ్చు..

ఇలా ప్రజల భద్రతకు హాని కలిగించే సందర్భాల్లో మాత్రమే చేయాల్సిన ఫోన్ టాపింగ్ ను ప్రభాకర్ రావు అండ్ టీం టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా మావోయిస్టుల ఫోన్లు టాప్ చేస్తున్నామని పై అధికారులను మభ్యపెట్టి రివ్యూ కమిటీ సభ్యులను సైతం తప్పుదోవ పట్టించి మావోయిస్టుల నంబర్లకు బదులు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లను ఇచ్చి టాప్ చేసేందుకు అనుమతులు పొందారు. ఇక ప్రభాకర్ రావు నుండి వచ్చిన ఆదేశాల మేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఆయా నంబర్లకు ఇంటర్ సెపేషన్ చేసే లైన్ ను ప్రభాకర్ రావు అండ్ టీంకు ఇచ్చారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ప్రభాకర్ రావును డెసిగ్నేటెడ్ అధికారిగా నియమించడం కూడా ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. 2020 జూన్ 30న ప్రభాకర్ రావు అప్పటి ఎస్ఐబీ ఇంచార్జ్ హోదాలో రిటైర్డ్ అయ్యారు. అయితే ప్రభాకర్ రావును తిరిగి రీ అపాయింట్ చేయాలని అప్పటి డీజీపీ సిఫారసు మేరకు మరో మూడు సంవత్సరాల పాటు ఆయనకు పదవీ కాలాన్ని పొడిగించారు. 2020 జూన్ 1 ప్రభాకర్ రావును SIB చీఫ్ ఆఫ్ ఆపరేషన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక, అదే నెలలో జూన్ 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన జీవోను తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్లకు టాపింగ్ చేసే నంబర్లు పంపేందుకు డెసిగ్నేటెడ్ అధికారిగా ప్రభాకర్ రావు ను నియమిస్తూ జీవో నెంబర్ 18ని జారీ చేసింది. ఇక, అప్పటి నుండి ప్రభాకర్ రావు డెసిగ్నేటెడ్ అధికారులు ఒకరుగా ఉన్నారు. ఇక డెసిగ్నేటెడ్ అధికారులను సైతం అప్పటి డిజిపి, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సిఫారసు మేరకే నియమించారని ఆరోపణ ఉంది. ఫోన్ టాపింగ్ అనుమతులు ఇచ్చే డెసిగ్నేటెడ్ అధికారి జాబితాలో ప్రభాకర్ రావు తో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ సభ్యులుగా ఉన్నారు.

ఇక ఫోన్ టాపింగ్ లో మరొక కీలక అంశం కాల్ డేటా రికార్డింగ్స్‌ను సర్వీస్ ప్రొవైడర్ల నుండి పొందటం. CDR లను సర్వీస్ ప్రొవైడర్ల నుండి పొందాలి అంటే కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే కాల్ డేటా రికార్డింగ్స్ ను తీయవచ్చు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రభాకర్ రావు అండ్ కో ఇష్టానుసారంగా అనేకమంది ప్రముఖులకు సంబంధించిన కాల్ డేటా రికార్డింగ్స్‌ను సర్వీస్ ప్రొవైడర్లతో తీయించింది. ఏయే ఫోన్ నెంబర్లకు సంబంధించిన కాల్ డేటా రికార్డింగ్స్‌ తీశారు. వాటి వివరాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ నోటీసులు జారీ చేసి, వారి నుండి వివరాలను సైతం తీసుకుంది. త్వరలో సిట్ కోర్టులో దాఖలు చేయబోయే సప్లమెంటరీ చార్జిషీట్‌లో ఈ వివరాలను పొందపరచనుంది.

ఇక ఆధారాల ధ్వంసానికి సంబంధించి దర్యాప్తులో టెక్నికల్ అంశం ముడిపడి ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ 419 A సబ్ క్లాస్ 18 ప్రకారం టాపింగ్ చేసిన డేటాను ప్రతి ఆరు నెలలకు ధ్వంసం చేయవచ్చు. ప్రతి ఏడాది జనవరి జులై మొదటి వారాల్లో ఆరు నెలల పాటు ట్యాప్ చేసిన రికార్డ్స్ మొత్తాన్ని తొలగించవచ్చు. అయితే ప్రభాకర్ రావు అండ్ టీం వీటిని సైతం అక్రమంగా తొలగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఆరు నెలల పాటు సేకరించిన టాపింగ్ వివరాలు మొత్తాన్ని డెసిగ్నేటెడ్ అధికారి ఆదేశాలతో తొలగించవచ్చు. కానీ ఆ రికార్డ్స్ తొలగించే ప్రక్రియలో భాగంగా సిస్టం అడ్మినిస్ట్రేటర్ మూడు లిస్టులను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మొదటి లిస్టులో ఇప్పటివరకు ఎన్ని ఫోన్ నెంబర్లను ఎన్ని ఇమెయిల్ ఐడిలను ఏయే సందర్భాల్లో టాప్ చేశారో వాటి వివరాలను ఒక లిస్టులో రాయాల్సి ఉంటుంది.

ఇక మరో లిస్టులో ఇకమీదట పలానా నంబర్‌ను టాపింగ్ చేయనవసరం లేదు అని భావించే ఫోన్ నెంబర్లను క్రోడీకరించాల్సి ఉంటుంది. ఇక మూడవ లిస్టులో ఇప్పటివరకు టాప్ చేసిన నంబర్‌ను మరో ఆరు నెలల పాటు ట్యాప్ చేయాలి అనుకునే వాటిని లిస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి ఏయే ఫోన్ నెంబర్లు టాప్ చేశారో ఎలాంటి వివరాలు దొరకకుండా ప్రభాకర్ రావు అండ్ టీం ఎస్ఐబి ఆఫీసులో ఉన్న హార్డ్ డిస్క్ లను మార్చేసి టాపింగ్ చేసిన రికార్డ్స్ మొత్తాన్ని తగలబెట్టారు. ఈ రికార్డ్స్ ద్వంసం చేసే ప్రక్రియలో పాల్గొన్న ఇతర ఎస్ఐబి అధికారులను సిబ్బందిని సైతం సీట్ విచారించి వారి స్టేట్‌మెంట్లను తీసుకుంది. ఎస్సై బి స్టాఫ్ మొత్తం ప్రణీత్‌ రావు చెబితేనే ఈ రికార్డ్స్ మొత్తాన్ని తొలగించామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇక ప్రణీత్‌రావు మాత్రం ప్రభాకర్ రావు తనకు ఆదేశాలు ఇస్తేనే రికార్డ్స్ ను తొలగించాననీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

ఇప్పటికే ఈ కేసులో డెసిగ్నేటెడ్ అధికారిగా ఉన్న ప్రభాకర్ రావు ను దర్యాప్తు అధికారులు ఏ 1 నిందితుడుగా పేర్కొన్నారు. పలు దఫాలుగా ఆయన విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభాకర్ రావు తోపాటు డిసిగ్నేటెడ్ అధికారి హోదా లో గతంలో పనిచేసిన అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్ తోపాటు, కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేష్ కుమార్ స్టేట్‌మెంట్లను సైతం సీట్ రికార్డు చేసింది. ఇక అప్పటి కాంపిటెంట్ అథారిటీగా ఉన్న హోం సెక్రటరీ అయ్యిన ప్రస్తుత డిజిపి జితేందర్ స్టేట్‌మెంట్లను సైతం సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఇక త్వరలో అప్పట్లో ప్రభాకర్ రావు ను రీ అప్పాయింట్ చేయాలి అని ప్రభుత్వానికి సిఫార్సు చేయటంతో పాటు, డెసిగ్నేటెడ్ అధికారి హోదా ప్రభాకర్ రావు కి ఇవ్వాలి అని సూచించిన మాజీ డిజిపి మహేందర్ రెడ్డి స్టేట్‌మెంట్లను సైతం త్వరలోనే సిట్ అధికారులు రికార్డు చేయబోతున్నారు. ఇక రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న అప్పటి సిఎస్, లా సెక్రెటరీ, ప్రభుత్వ కార్యదర్శిల స్టేట్‌మెంట్లను ఇప్పటికే సీట్ రికార్డు చేశారు.

ప్రభాకర్ రావు రాక ముందు జరిగిన దర్యాప్తు ఒక ఎత్తైతే ప్రభాకర్ రావు వచ్చాక జరుగుతున్న దర్యాప్తు మరో మలుపు తీసుకుంది. కేవలం మావోయిస్టు ఆపరేషన్లు, ప్రజల భద్రతకు హాని కలిగించే వారి ఫోన్ నెంబర్లను టాప్ చేయవలసిన ప్రభాకర్ రావు అండ్ టీం నిబంధనలు ఉల్లంఘించి ఎవరి ఆదేశాల మేరకు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను టాప్ చేశారో దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభాకర్ రావును విచారించిన పోలీసులు ఆయన విచారణకు సహకరించలేదని సుప్రీంకోర్టులో త్వరలోనే కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. సుప్రీం కోర్ట్ రిలీఫ్ రద్దయితే, ప్రభాకర్ రావును సిట్ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ప్రభాకర్ రావు తోపాటు శ్రవణ్ రావులకు సంబంధించిన వ్యవహారాలపై త్వరలోనే సప్లమెంటరీ ఛార్జ్ షీట్‌ను సైతం సిట్ దాఖలు చేయబోతుంది.

About Kadam

Check Also

అల్పపీడనం అలెర్ట్.. తెలంగాణకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రసరణ మరియు ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి.. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *