మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు?

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు. గత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ వర్మ.. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌‌ను ఓడించారు. పర్వేష్ వర్మ తొలిసారిగా మే 2014లో 16వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 జాతీయ ఎన్నికలలో తిరిగి ఎన్నికయ్యారు. గత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ వర్మ.. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై విజయం సాధించారు.

బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ వర్మ. దేశ రాజధానిలోని అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో ఒకరు. అతని మామ ఆజాద్ సింగ్ ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఉన్నారు. 1977 నవంబర్ 7న జన్మించిన వర్మ, ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కాలేజీలో చేరారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని కూడా పొందారు.

తొలిసారిగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై మెహ్రౌలి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. మెహ్రౌలి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ ప్రత్యర్థి యోగానంద్ శాస్త్రిని ఓడించారు. ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. 2019లో తిరిగి ఇదే నియోజకవర్గాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. వర్మ 2024 ఎన్నికల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో తలపడ్డారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో వర్మ తన కాంగ్రెస్ ప్రత్యర్థి మహాబల్ మిశ్రాను 5,78,486 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. వర్మ తన రికార్డును తానే బద్దలు కొట్టడమే కాకుండా ఢిల్లీలో అత్యధిక విజయ ఆధిక్యంతో అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన వర్మ, 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఉగ్రవాది అని పిలిచిన తర్వాత ఎన్నికల సంఘం ఆయనపై 24 గంటల పాటు నిషేధం విధించింది.

తాజాగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు. అయితే ముఖ్యమంత్రి పదవిపై ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. ఇది ప్రధాని మోదీ విజయమనీ, ఢిల్లీ ప్రజల విజయమనీ చెప్పారాయన. బీజేపీ విజయం సాధించిన వెంటనే పర్వేష్‌ వర్మ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇంటికెళ్లి ఆయనను కలుసుకున్నారు.

About Kadam

Check Also

కథన సీమలో కొదమ సింహం.. మన ‘ఆకాష్’ వైపు బ్రెజిల్ చూపు..!

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన తర్వాత, బ్రెజిల్ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, ఇతర భారతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *