అనుకున్నంతా అయ్యింది… బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని గులాబీఅధిష్ఠానం కన్నెర్ర చేసింది. గీతదాటితే, హద్దుమీరితే… కన్నకూతురైనా లెక్కచేయనన్న సంకేతాలు పంపిన గులాబీ దళపతి.. కవితపై బహిష్కరణ వేటు వేశారు. కొంతకాలంగా పార్టీపైనా, పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పిస్తున్న కవిత తీరుపై…. ఎట్టకేలకు చర్యలు తీసుకున్న అధినేత కేసీఆర్, ఏకంగా పార్టీ నుంచి బయటకు సాగనంపేశారు.
తనకు ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక… చాలాకారణాలే కనిపిస్తున్నాయి. పార్టీ సైతం.. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడానికి చాలా రీజన్సే కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ కేసీఆర్ కూతురనో… పార్టీ ఆడకూతురనో.. ఆమె కామెంట్స్‌పై అధినేత సహా, పార్టీనేతలు సైతం పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ, ఇప్పుడు ఏకంగా కేటీఆర్, హరీష్, సంతోష్‌లాంటి పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం.. పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడటం… అధినేతకు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, కాళేశ్వరం విషయంలోనూ ఆమె టంగ్ స్లిప్పవడం.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతా హరీష్‌రావు, సంతోష్‌రావులే చేశారనీ.. వారివల్లే కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటుకున్నాయనీ… తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత… పరోక్షంగా కాళేశ్వరంలో ఏదో తప్పు జరిగిందన్నట్టుగా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అది ప్రత్యర్థులకు అస్త్రం అందేలా చేసిందని పార్టీ భావిస్తోంది.
ఒక్క కేసీఆర్ తప్ప…. ఒకే ఒక్క కేసీఆర్ తప్ప…ఇదీ, కొన్నాళ్లుగా బీఆర్‌ఎస్ రాజకీయాల్లో వినిపిస్తున్న కవితాగానం. కేసీఆర్ దేవుడే… ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో మొదలైన కలకలం… ఇక్కడి దాకా లాక్కొచ్చింది. కేసీఆర్ ఒక్కరిని మినహాయించి.. బీఆర్‌ఎస్‌లో మిగితా నేతలందరినీ ఆమె టార్గెట్ చేస్తున్న తీరు గులాబీసేనను ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. అందుకే అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలుస్తోంది.
తెలంగాణ జాగృతిని స్థాపించి ఉద్యమ పార్టీతోనే కొన్నేళ్లుగా ప్రయాణం కొనసాగించిన కవిత… ఒకసారి నిజామబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీ ఎమ్మెల్సీగానూ అవకాశం ఇచ్చింది పార్టీ. పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ల తర్వాత ఆస్థాయి నాయకురాలిగా కవితకు పేరుండేది. కానీ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యాక, పరిస్థితి మారింది. ఈ కేసులో ఆర్నెళ్లకుపైగా జైళ్లో ఉన్న కవిత.. బెయిల్‌పై విడుదలయ్యాక అంతే స్పీడుతో రాజకీయంగా దూసుకొచ్చారు. అయితే, ఆ స్పీడు కాస్తా.. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా చేసింది.
ఏప్రిల్‌లో ఘనంగా బీఆర్‌ఎస్ రజతోత్సవ సంబరాలు జరుపుకోగా… పార్టీ తీరును తప్పుబడుతూ కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ మే 20న బహిర్గతం కావడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న కవిత… తిరిగొచ్చాక పెద్ద బాంబే పేల్చారు. అది రాసింది తానేననీ… అయితే అది ఎలా బయటకు వచ్చిందో తేలాలంటూ… పెద్ద బాంబే పేల్చారు. కేసీఆర్ దేవుడే కానీ… ఆయన చుట్టూతా కొన్ని దయ్యాలున్నాయంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులిస్తే… పార్టీ ఏం చేస్తోందంటూ.. నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత. అంతేకాదు, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందర హాజరయ్యేందుకు ముందు, సరిగ్గా ఒక్కరోజు ముందు…. గన్‌పార్క్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కూడా చేశారు. తనపై కొందరు పార్టీలో కుట్రలు చేస్తున్నారంటూ… కవిత చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. కర్మకు తగ్గ ఫలితం అనుభవిస్తారంటూ.. అప్పట్లో ఆమె చేసిన హెచ్చరిక సంచలనం రేపింది.
పార్టీతో సంబంధం లేకుండా ఆమె చేపట్టిన కార్యక్రమాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. జాగృతికోసం ప్రత్యేకంగా ఆఫీసును ప్రారంభించిన ఆమె… ఇక బీఆర్‌ఎస్‌తో సంబంధం లేదన్నట్టుగానే ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. బీసీల రిజర్వేషన్లయినా, ఇతర అంశాలైనా.. ఆమె సొంత ఎజెండాతో ముందుకు వెళ్లారు. అందుకే, ఇటీవల ఆమెను సింగరేణి పార్టీ అనుబంధం సంఘం బాధ్యతలనుంచి కూడా తప్పించారు. ఇలా వరుస పరిణామాల తర్వాత… ఆమె వ్యవహారశైలి మితిమీరినట్టుగా భావించిన గులాబీ బాస్… కూతురిపై బహిష్కరణ వేటు వేశారు.