వివాహేతర సంబంధాలు, సహజీవనం.. వివిధ సందర్భాలలో తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు తీసే వరకు లేదా తీసుకునే వరకు వెళ్తున్నాయి.. తాజాగా.. ఏపీలో జరిగిన ఘటన సంచలనంగా మారింది.. వాస్తవానికి ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరిగే దాడులపై పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రేమించిన యువతి మోసం చేసినా, తాన మాట వినకపోయినా యువకులు యాసిడ్ దాడి చేయటం, కత్తులతో బెదిరించటం, హతమార్చడం వంటి ఘటనలు చాలానే చూశాం.. కానీ విజయవాడకు చెందిన ఓ మహిళ తనతో సహజీవనం చేసిన వ్యక్తిపై యాసిడ్ దాడి చేయటం పశ్చిమ గోదావరిలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొడేరుకు చెందిన జయకృష్ణ అనే యువకుడు భీమవరం, నర్సాపురం, రాజమండ్రిలలో పలు దుస్తుల షాపుల్లో సేల్స్ మన్, మేనేజర్ గా పనిచేసేవాడు. 2023 నుంచి విజయవాడలో ఒక క్లాత్ స్టోర్‌లో మేనేజర్ గా పనిచేసాడు. అదే షాపులో పనిచేస్తున్న విజయవాడకు చెందిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అయితే, ఆ అమ్మాయి ఆర్థిక పరిస్తితి బాగాలేదని, పలు దఫాలుగా రెండు లక్షల నలభై వేలు అప్పుగా ఇచ్చానని, డబ్బులు అడిగినందుకు పాలకొడేరు వచ్చి తనపై యాసిడ్ దాడి చేసిందని పాలకొడేరు పోలీసులకు ఫిర్యాదు చేసాడు జయకృష్ణ.. అతని ఫిర్యాదు మేరకు పాలకొడేరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, జయకృష్ణ తనపై అత్యాచారం చేసాడని విజయవాడ పడమట పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు విజయవాడ పడమట పోలీసులు. తనపై పోలీసులకు పిర్యాదు చేసిందని తెలుసుకున్న జయకృష్ణ తనపై యాసిడ్ దాడి చేసిందని పోలీసులు ఫిర్యాదు చేసాడు.
ఈ వేర్వేరు ఘటనలపై విజయవాడ, పాలకోడేరు ల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే, బురఖా వేసుకుని వచ్చిన మహిళ తనపై యాసిడ్ పోసిందని తాను తప్పించుకున్నానని జయకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అన్ని కోణాల్లోనూ పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.