టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యదగిరి గుట్ట పవిత్రత కాపాడేలా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పన చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో, ధర్మకర్తల మండలి (యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు) ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాకు పలు సవరణలను సీఎం ప్రతిపాదించారు..
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) తరహాలోనే యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
యాదగిరిగుట్ట ఆలయం ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. తిరుమల మాదిరిగా ఆలయ నిర్వహణలో రాజకీయ ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆలయ ధార్మిక వాతావరణాన్ని పరిరక్షించేందుకు, ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరఫున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు. ఈ మార్పులు భక్తులకు మతపరమైన సేవలను అందించడం, ఆలయ పాలన, నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.