యాదగిరిగుట్టకు అంతర్జాతీయ గుర్తింపు.. స్వామివారి సేవలను ప్రశంసించిన కెనడా ప్రధాని!

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను ఇప్పటికే ప్రపంచ నేతలు, ఆధ్యాత్మిక వేత్తలు ప్రసంశించారు. తాజాగా యాదగిరిగుట్ట దేవస్థానం అందిస్తున్న సేవలను కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ అభినందించారు. ఈ మేరకు యాదగిరిగుట్ట దేవస్థానంకు ఆయన లేఖ రాశారు.

తెలంగాణ తిరుపతిగా పేరున్న శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు నానాటికి పోటెత్తుతున్నారు. ముఖ్యంగా సెలవు దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో యాదగిరిగుట్ట దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు సేవలను సరికొత్తగా అందుబాటులోకి తీసుకు వస్తోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలను కూడా దేవస్థానం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కెనడాలోని ఒట్టావాలో ఈవై సెంటర్‌లో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించింది. స్వామివారి కల్యాణానికి ఒట్టావా నగరంలోని హిందూ భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ నెల 27 వరకు కెనడాలోని నాలుగు రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఒట్టావాలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడాన్ని అభినందిస్తూ యాదగిరిగుట్ట దేవస్థానంకు కెనడా ప్రధాని కార్నీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆలయ నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మిక, ఐక్యత ఎంతో గొప్పదని ఆయన ప్రశంసించారు. శ్రీలక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కెనడా సమాజాన్ని సుసంపన్నం చేయడంలో శ్రీ హిందూ సమాజం పాత్రను ఆయన కొనియాడారు. ఒక పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడానికి, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడంతోపాటు ఐక్యత, సమాజ విలువలను గౌరవించడానికి కల్యాణ మహోత్సవం ఒక మంచి సందర్భమని కెనడా ప్రధాని కార్ని అభివర్ణించారు.

ఒట్టావాలో భక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంతో ఆలయ నిర్వాహకులు, సమన్వయకర్తలు చేసిన కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కెనడా ప్రధాని కార్ని దేవస్థానంకు రాసిన లేఖపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఆలయ ఈవో వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్వామివారి సేవలను మరింత విస్తృతం చేసి, భక్తులకు చేరువ చేస్తామని ఈవో వెంకట్రావు తెలిపారు.

About Kadam

Check Also

అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం.. ఏంటి 8 నెలల్లో ఇంత మంది అరెస్టా?

తెలంగాణలో అవినీతిని అరికట్టడంలో ఏసీబీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఎనిమిది నెలల్లోనే ఏసీబీ మొత్తం 179 కేసులు నమోదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *