నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి. ఇడుపులపాయలో YSR జయంతికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. వైఎస్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు జగన్. ఉదయం 8.15 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలను కలిసి వారి నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం పులివెందుల నుంచి 3.50 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు బెంగళూరు చేరుకుంటారు.
మరోవైపు తెలంగాణలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నివాళులర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న వైఎస్సార్ జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.
కార్యక్రమంలో పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారని టీపీసీసీ తెలిపింది. కాగా, వైఎస్సార్ జయంతి సందర్భంగా పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలలు కన్న సమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు.