వైసీపీ పార్టీ సింబల్ మార్పుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమన వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. వైసీపీ పార్టీ చిహ్నాన్ని మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ గుర్తును మార్చాలని ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశాసినట్టు ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. పార్టీకి ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని లేఖలో శివకుమార్ పేర్కొన్నట్టు కనిపించింది. వైసీపీ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ఆయన లేఖలో ప్రస్తావించినట్టు వార్తలు వచ్చాయి.
అయితే పార్టీ గుర్తును మారుస్తున్నట్టు వచ్చిన వార్తలను వైసీపీ పార్టీ ఖండించింది. వైసీపీ పార్టీ గుర్తును మార్చాలని శివకుమార్ ఈసీకి లేఖ రాసినట్టు జరుగుతున్న ప్రచారంతో వాస్తవం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్దం అని పేర్కొంది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పార్టీ అధిష్టానం తెలిపింది.