వందమందే రావాలన్నారు.. కానీ వందలాది మందొచ్చారు..! ఆంక్షలున్నాయ్ అదుపులో ఉండాలన్నారు.. అబ్బే అవేం పట్టవంటూ అల్లకల్లోలం చేశారు. ఫలితంగా రోజంతా టెన్షన్… అడుగడుగునా జనసందోహంతో సాగిన వైసీపీ అధినేత జగన్ పర్యటనపై పొలిటికల్ ఫైట్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. శాంతిభద్రతలకు భంగం అంటూ కూటమి కన్నెర్ర చేస్తుంటే.. పరామర్శకు వెళ్తే పగబడతారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరీ టూర్ ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉండబోతోంది..? నమోదుకాబోయే కేసులెన్ని..? అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇసుకేస్తే రాలనంత జనం..! వందలాది మంది పోలీసులు పహారా కాసినా అదుపుచేయలేని పరిస్థితి. బారికేడ్లు ఆపలేకపోయాయి..! చెక్‌పోస్టులు నిలవరించలేకపోయాయి. ఫలితంగా జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. జగన్‌ను చూసేందుకు దారిపొడువునా జనం ఎగబడ్డారు. పోలీసులు వందలాది బారికేడ్లు పెట్టినా తోసుకుంటూ వెళ్లిపోయారు. తీరా జగన్ రెంటపాళ్ల చేరుకున్నాకైనా పరిస్థితి అదుపులోకి వస్తుందనుకుంటే.. అదీ జరగలేదు. వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహా విష్కరణ కార్యక్రమంలోనూ తోపులాటే జరిగింది.
ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకుంటారా అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగడమేకాదు… బారికేడ్లను సైతం తోసేశారు అంబటి.
ఇక జగన్ పర్యటనపై పొలిటికల్ రచ్చ మొదలైంది. ఏపీలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకే జగన్ కుట్ర చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. తన బల ప్రదర్శన కోసం జనాలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ సైతం జగన్ పర్యటనపై ఫైర్ అయ్యారు. పరామర్శల పేరుతో ఓ మాజీ సీఎం జనాలను రెచ్చగొట్టడం దారుణమంటూ పేర్కొన్నారు.
ఇటు పోలీసులు సైతం వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాన్వాయ్‌లో 3 కార్లకు పర్మిషన్ ఇస్తే… 30 కార్లు వచ్చాయన్నారు. వందమందికి అనుమతిస్తే వందలాది మందొచ్చారని… ఎక్కడా రూల్స్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ టూర్‌పై పొలిటికల్ ఫైట్ ఇంకెంత దూరం వెళ్తుందో…! ఈ ఘటనతో ఎవరి మీద ఎన్ని కేసులు నమోదవుతాయో చూడాలి..