కేరళలో ప్రకృతి ప్రకోపం మరిచిపోకముందే హిమాచల్ ప్రదేశ్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. సిమ్లా సమీపంలోని రామ్‌పూర్‌లో గురువారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ అయినట్టు కుండపోత వర్షం కురవడంతో 20 మంది గల్లంతయ్యారు. సమేజ్ ఖడ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో క్లౌడ్ బరస్ట్ అయినట్టు విపత్తు నిర్వహణ దళానికి సమాచారం వచ్చిందని జిల్లా అధికారులు తెలిపారు. తక్షణమే అక్కడకు విపత్తు నిర్వహణ బృందం, డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్, ఎస్పీ సంజీవ్ గాంధీ సహా ఇతర ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్లారని వెల్లడించారు.
క్లౌడ్ బరస్ట్‌తో ప్రభావితమైన ప్రదేశంలో 20 మంది గల్లంతైనట్టు తమకు సమాచారం వచ్చిందని అనుపమ్ కశ్యప్ తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతాన్ని కలిపే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో రెస్క్యూ బృందం అక్కడకు చేరుకోవడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. సిమ్లాతో పాటు మండిలోనూ క్లౌడ్ బరస్ట్ అయ్యింది. ముహల్ తెరాంగ్ సమీపంలోని రాజ్బన్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా రోడ్లు కొట్టుకుపోయి.. కొండచరియలు విరిగిపడ్డాయిని మండి డిప్యూటీ కమిషనర్ అపూర్వ దేవగణ్ పేర్కొన్నారు.
‘ఇటువంటి పరిస్థితులలో ఉద్యోగులు, విద్యార్థులు, సహా పౌరులు బయటకు వెళ్లడం సురక్షితం కాదని, అత్యవసరమైతే తప్పా వెళ్లాలి’ అని ఆయన సూచించారు. పధార్ డివిజన్ పరిధిలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్ పొరుగున ఉన్న ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. తెహ్రీ గర్వాల్ జిల్లాలోని జాఖన్యాలీలో క్లౌడ్ బరస్ట్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం రాత్రి కుండపోత వర్షానికి ఆ ప్రాంతంలో ముగ్గురు గల్లంతైనట్టు తమకు సమాచారం వచ్చిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం అధికార ప్రతినిధి తెలిపారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్.. గాలింపు చేపట్టగా రెండు మృతదేహాలు లభ్యమైనట్టు చెప్పారు. 200 మీటర్ల లోతైన లోయలో గాయాలతో ఉన్న మరో వ్యక్తిని గుర్తించి బయటకు తీశారని అన్నారు.