తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే హైవేపై.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మినీలారీ బోల్తాపడటంతో ఏడుగురు చనిపోయారు.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో మినీలారీ బయల్దేరింది. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్ల సమీపంలో.. ఆరిపాటిదిబ్బలు-చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో మినీ లారీ అదుపుతప్పి పంటబోదెలోకి వాహనం దూసుకువెళ్లి తిరగబడింది.
ఈ ప్రమాదంలో.. సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య, తమ్మిరెడ్డి సత్యనారాయణ, తాడి కృష్ణ, కత్తవ కృష్ణ , కత్తవ సత్తిపండు, పి.చినముసలయ్య.. నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్ చనిపోయారు. ఈ ఘటన జరిగిన సమయంలో మినీ లారీలో 9మంది జట్టు సభ్యులు ఉన్నారు.. డ్రైవర్ తప్పించుకుని పరారయ్యాడు. వాహనం తిరగబడిన సమయంలో జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకుని ఏడుగురు చనిపోయారు.
గాయపడిన వారిలో ఒకరిని ఘంటా మధుగా గుర్తించారు.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఏడుగురి మరణంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.