Stock Market Today: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. స్టాక్ మార్కెట్ సూచీలు ఒకే దిశలో ముందుకు దూసుకెళ్లాయన్న సంగతి తెలిసిందే. మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగా.. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో రికార్డు స్థాయిలో షేర్ల కొనుగోళ్లు జరగ్గా.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ వరుసగా పెరుగుకుంటూ పోయి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకాయి. దాదాపు 2 నెలలకుపైగా ర్యాలీ కొనసాగగా.. ఒక్కసారిగా అక్టోబర్ నెలలో బ్రేక్ పడింది. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంటుంది. గత వారం ఇదే జరిగింది. సెన్సెక్స్, నిఫ్టీ వరుస సెషన్లలో భారీగా పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు నష్టపోయారు.
ఇక మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న కంపెనీలు భారీగా నష్టపోయాయి. వీటిల్లోనే ఇన్వెస్టర్లను నష్టాలు వెంటాడాయి. మార్కెట్ విలువ పరంగా దేశంలోని టాప్-10 సంస్థల్లో 7 కంపెనీల మార్కెట్ విలువనే ఏకంగా రూ. 1.22 లక్షల కోట్లకుపైగా పతనమైంది. వీటిల్లో అత్యధికంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ తగ్గింది.