ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్‌వోడీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) 24 శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో.. 12వ పీఆర్‌సీ కమిషనర్‌ని నియమించాలని కోరారు.. త్వరగా ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు.
గత ప్రభుత్వం హయాంలోని భూ ఆక్రమణలపై ఇవాళ కీలక సమీక్షా సమావేశం జరగనుంది. ప్రధానంా భూ ఆక్రమణలు, భూముల రీ సర్వే మీద రెవెన్యూశాఖ తరఫున ఒక సమావేశం, రిజిస్ట్రేషన్ల తీరుపై విడిగా మరో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఈ సమావేశాల్లో రికార్డులు, ఇతర అంశాలపై చర్చిస్తారు. వైఎస్సార్‌సీపీ పాలనలో అస్తవ్యస్తంగా జరిగిన భూముల రీ సర్వేను నిలిపేస్తున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో ఇప్పటికే రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఏం చేయాలి?.. జరుగుతున్న గ్రామాల్లో ఏం చేయాలి?.. జరగబోయే గ్రామాల్లో ఏం చేయాలనే అంశాలపై అధికారుల్లో అస్పష్టత కనిపిస్తోంది. ఇవాళ నిర్వహించే ఈ రెండు సమీక్షా సమావేశాల ద్వారా ఎలా ముందుకు వెళ్లాలనే కసరత్తుపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఇటు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డులు, ఇతర ఫైల్స్ దహనంపై తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే అంశంపైనా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.
ఐటీ మంత్రి నారా లోకేష్‌ను ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.. అంతేకాదు ఆరు నెలలకు పైగా బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించలేకపోతున్నామని మంత్రికి వివరించారు. ఆస్పత్రుల్లో సరైన వైద్య సామాగ్రిని కొనుగోలుచేయలేకపోతున్నానమన్నారు. జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితులు ఉన్నాయని.. ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించాలని ప్రధానంగా కోరారు.