ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గృహ నిర్మాణ శాఖపై సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి పార్థసారథితో కలిసి ఆయన గృహ నిర్మాణ శాఖ మీద సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఇళ్ల స్థలాల పంపిణీలో చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. కొత్త లబ్దిదారులకు ఈ విధానం అమలు చేయనున్నట్లు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లే అవుట్లు వేసింది. అయితే లే అవుట్లు వేయని చోట కూడా ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు.
మరోవైపు వచ్చే వందరోజుల్లోనే లక్షా 25 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అలాగే ఏడాదిలోపు 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం చెల్లింపులు చేయలని ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులకు చెల్లింపులు చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. మధ్య తరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఇక జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణంపైనా చంద్రబాబు చర్చించారు. తక్కువ ధరలకే జర్నలిస్టులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.