మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి బీభత్సం ఇప్పటివరకు 43 మందిని పొట్టనబెట్టుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో వందల మంది ప్రజలు.. శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం విచారకరమని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. తాను కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు. కేంద్రం నుంచి సహాయం చేస్తామని ప్రకటించారు. మరోవైపు.. వయనాడ్ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయినవారికి పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్ కింద రూ.2 లక్షలు పరిహారం చెల్లించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. గాయపడినవారికి రూ.50 వేలు అందించనున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.