పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మను భాకర్ మరోసారి మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. సరబ్జోత్ సింగ్‌తో కలిసి బరిలోకి దిగిన భాకర్.. వరుసగా రెండో ఈవెంట్‌లోనూ కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ రెండూ మను భాకర్ సాధించినవే కావడం విశేషం.
సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో కాంస్య పతకం కోసం జరిగే పోరుకు అర్హత సాధించింది. కొరియాకు చెందిన జూ లీ, వొన్హో లీతో మంగళవారం జరిగిన పోరులో 16-10 తేడాతో గెలిచిన మను, సరబ్జోత్ జోడీ.. భారత్‌కు రెండో పతకాన్ని అందించింది.
ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించిన మను భాకర్-సరబ్జోత్ సింగ్ జోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా వారిని అభినందించారు. మను, సరబ్జోత్ ఇద్దరూ గొప్ప నైపుణ్యాన్ని, టీమ్ వర్క్‌ను ప్రదర్శించారని ప్రధాని కొనియాడారు. మనుకు ఇది వరుసగా రెండో ఒలింపిక్ పతకమన్న ప్రధాని.. ఆమె ఎంత అకింతభావంతో, నిలకడగా రాణిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.