గంటలోనే 13 సెం.మీ. వర్షం.. రెడ్ అలర్ట్ జారీ.. 

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురిసిన వర్షాలకు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక, దేశ రాజధాని నగరం ఢిల్లీని బుధవారం సాయంత్రం వరుణుడు వణికించాడు. కేవలం గంటలోనే దాదాపు 13 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. గురువారం కూడా అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందన్న భారత వాతావరణ విభాగం.. రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఇక, బుధవారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమై.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రహదారులపై పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. మోకాల్లోతు నీళ్లతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. ప్రతికూల వాతావరణంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన టోక్యో విమానం సహా పది విమానాలను దారి మళ్లించారు. గురువారం ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తంగా విద్యా సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ‘ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది.. రేపు కూడా అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.. ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నాం’ అని ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతీషి ట్వీట్ చేశారు.

మరోవైపు, రావూస్‌ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతికి నిరసనగా ఓల్డ్‌ రాజిందర్‌నగర్‌లో విద్యార్థులు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. ఈ ప్రాంతం కూడా మరోసారి వరద నీటితో మునిగిపోయింది. అక్కడ అనేక కోచింగ్‌ సెంటర్లలోకి వర్షం నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో స్థానిక ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. మోకాళ్లలోతులో నీరు నిలిచిపోగా.. వాటిలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయడానికి పోలీసులకు కొందరు విద్యార్థులు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆమ్‌ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాట్లాడుతూ.. కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాలు సహా మిగతా ప్రదేశాల్లోని వర్షం నీటి సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరినట్లు చెప్పారు. ‘ఢిల్లీలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులందరినీ హెచ్చరించాను.. ప్రజల సాధారణ కార్యకలాపాలకు అసౌకర్యం కలగకుండా చూడటమే కాకుండా, కోచింగ్ సెంటర్‌లతో సహా నీటి ఎద్దడి ఉండే ప్రదేశాల్లో సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించాలని వారికి సూచించాం’ అని సక్సేనా సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

అటు, ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసు జంక్షన్, కన్నాట్ ప్లేస్, మింటో రోడ్, మోతీ బాగ్ ఫ్లైఓవర్‌లో భారీగా వరద నీరు చేరింది. మింటో వంతెన సహ పలు అండర్‌పాస్‌లు నీటి మునగడంతో వాటిని మూసివేశారు. ఎయిరిండియా,విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్ సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీచేశాయి. టోక్యో-న్యూఢిల్లీ ఎయిరిండియా విమానం జైపూర్‌కు దారి మళ్లించారు.

About amaravatinews

Check Also

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *