తెలంగాణ అసెంబ్లీలో నేడు గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ ముందు ఆందోళన చేపట్టగా.. అభ్యంతరం చెబుతూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అమాంతం ఎత్తుకెళ్లి పోలీసులు వాహనాల్లో ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తరలించారు.
బుధవారం (జులై 31) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించారని .. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్‌కు వాయిదా తీర్మానం సైతం ఇచ్చారు. ఉదయం నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై ప్రభుత్వం చర్చను ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం.. బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. నిండు అసెంబ్లీలో మహిళా సభ్యులను ఘోరంగా అవమానించారని.. సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే స్పీకర్ మాత్రం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడితేనే మైక్ ఇస్తానని తెగేసి చెప్పాడు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. వెల్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. స్పీకర్ వారిని వారించటంతో సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్ ముందు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని అక్కడే బైఠాయించి హెచ్చరించారు. పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకున్న అసెంబ్లీ మార్షల్స్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు.
అయినా వెనక్కి తగ్గని ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు కూర్చుని ప్రభుత్వం, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, మార్షల్స్ వారిని అరెస్టు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర సభ్యులను అమాంతం ఎత్తుకెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అనంతరం వారిని అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తరలించారు.