జగన్ సర్కార్ ఆ ప్రాజెక్టులన్నీ కొనసాగిస్తాం.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వెనక్కి వెళ్లేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తమకు విధ్వంసం చేయాలన్న ఆలోచన లేదని.. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యం) విధానంలో పోర్టులను పూర్తి చేయాలని భావించిందని గుర్తు చేశారు. కానీ గత జగన్ ప్రభుత్వం వాటిని ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానానికి మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇపపుడు ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇవ్వడం భారంగా ఉందని.. ఒకవేళ ఆ నిబంధనలను మారిస్తే ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వ హయాంలోని ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో ఏపీఐఐసీ భూములు కొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయని.. వెంటనే వాటిపై ఫోకస్ పెట్టాలని కలెక్టర్లుకు సూచించారు ముఖ్యమంత్రి. ఆ భూముల్ని తిరిగి వెనక్కి తీసుకునే చర్యలు చేపట్టాలని.. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల ప్రభుత్వం అనే వాతావరణాన్ని తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వ తీరుతో ఇక్కడి పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. గత ప్రభుత్వం ఇంటికి పైపు లైను ద్వారా గ్యాస్‌ అందించే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని.. ఈ ప్రాజెక్టును ఇచ్చిన వ్యవధిలో పూర్తి చేయకపోతే అదనపు భారం తప్పదన్నారు.

గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం పీపీఏ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను) రద్దు చేసిందన్నారు చంద్రబాబు. రాష్ట్రానికి ఆ సమయంలో అవసరమైన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌ నుంచి అధిక ధరకు కొనుగోలు చేసిందని ఆరోపించారు. అయితే కోర్టు జోక్యంతో ఉత్పత్తి సంస్థలకు ఒప్పందాల మేరకు చెల్లించిందని.. మార్కెట్‌లో కొనుగోలు చేసిన విద్యుత్తుకు అదనంగా చెల్లించి.. ఆ భారం ప్రజలపై వేసిందని ధ్వజమెత్తారు. అయితే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఉండకూడదని అధికారుల్ని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా అవసరమైన విధానాన్ని తీసుకొస్తామని.. ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విధానం ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం భాగస్వామ్యంతో ఇళ్ల కప్పులు, ఫీడర్‌ స్థాయిలో మినీ సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి.

రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి హంగూ, ఆర్భాటాల్లేకుండా సమర్థంగా పాలన సాగాలన్నారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్ల ప్రయాణాల్లోనూ వాహనాలు నిలిపేయడం, సైరన్లు పెట్టడం చేయొద్దని సూచించారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా వాహనాలకు సైరన్‌ పెట్టారని.. ఇలా చేసి తెలియకుండానే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటారన్నారు. అంతేకాదు పెద్దపెద్ద సభలు అవసరం లేదని.. సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వంపై జరిగే తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పడం, ప్రజలను చైతన్యం చేయడం, అవాస్తవమైతే సాక్ష్యాధారాలతో చెప్పడం అందరి బాధ్యతన్నారు.

ప్రతి ఒక్కరూ తోటి ఉద్యోగులతో మర్యాదగా మాట్లాడాలని.. ఒక్కోసారి అధికారులు చేసే తప్పులు ప్రభుత్వంపై ప్రతిబింబిస్తాయని.. సమర్థంగా పని చేయించుకోవాలి అన్నారు చంద్రబాబు. తాను తప్పు చేయనని.. తప్పు చేసినవారిని వదిలిపెట్టను అన్నారు. అధికార పార్టీ వాళ్లు తప్పులు చేసినా వదిలిపెట్టొద్దని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని.. తప్పు చేసింది ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *