CM Chandrababu talks with Youtube CEO on Academy in AP:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు పెంచుకున్న చంద్రబాబు.. ఇప్పుడు హామీల అమలు, పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్ పెట్టారు. ఏపీలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించిన చంద్రబాబు.. ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపైనా వారితో చర్చించారు.
స్థానికంగా ఉన్న సంస్థలతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ డెవలప్‌మెంట్, స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ప్రోత్సాహించేందుకు యూట్యూబ్ అకాడమీ ఉపయోగపడుతుందని చంద్రబాబు వారితో చర్చించారు. ఇదే సమయంలో అమరావతి రాజధాని ప్రాంతంలో తలపెట్టిన మీడియా సిటీ నిర్మాణంలో సాంకేతిక సహకారం అందించే విషయమై వారితో చర్చించినట్లు చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ (Chandrababu naidu) చేశారు. మరోవైపు అమరావతి రాజధాని ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన చంద్రబాబు.. రాజధానిలో కేంద్ర సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేయటంతో పాటుగా అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికే కేంద్ర సంస్థ బీపీసీఎల్ మచిలీపట్నంలో ప్లాంట్ ఏర్పాటుపై.. ప్రభుత్వంతో చర్చిస్తున్న సంగతి తెలిసిందే.
బుధవారం చీరాలకు చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు చీరాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. బుధవారం సీఎం చంద్రబాబు చీరాలలో పర్యటిస్తారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు చీరాలలోని జాండ్రపేటకు సీఎం చేరుకుంటారు. జాండ్రపేట మైదానంలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు. అలాగే పలువురు నేత కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మంత్రి సవిత, స్థానిక టీడీపీ నేతలు ఇప్పటికే చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.