డిప్యూటీ సీఎం గారి విజ్ఞప్తి.. ఇక నుంచి వారంలో ఒక్కరోజైనా ఆ పని చేయండి

AP Deputy CM: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి వారంలో ఒక్క రోజైనా ప్రజలు.. చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఉపముఖ్యమంత్రి.. ప్రజలకు ఈ సూచన చేశారు. ఈ క్రమంలోనే చేనేత కార్మికులను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. నెలకు ఒకసారైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని హితవు పలికారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం, డిప్యూటీలు ఆంధ్రప్రదేశ్ వాసులకు ఈ విజ్ఞప్తి చేశారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వారంలో ఒక్కరోజైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత రంగం ఒకటి అని.. ఇదొక కళాత్మకమైన పరిశ్రమ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి ప్రాంతాలు.. చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలు ధరించడం అనేది ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని నింపిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అలాంటి చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కచ్చితంగా చేనేత పరిశ్రమకు, చేనేత రంగంపై ఆధారపడిన నేతన్నలకు భరోసా ఇస్తుందని చెప్పారు. అదే విధంగా ప్రజలు కూడా ఈ చేనేత రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని వివరించారు. కొన్నేళ్ల కిందట నేను చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని తాను తెలిపానని.. ఆ క్రమంలోనే నేత వస్త్రాలను ధరిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా యువత, ఉద్యోగులు వారంలో ఒక రోజైనా చేనేత వస్త్రాలను ధరిస్తే చేనేత రంగంపై ఆధారపడిన వారికి ధీమా కలుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

About amaravatinews

Check Also

ఆళ్లగడ్డలో అన్నాచెల్లెల్లు ఢీ అంటే ఢీ

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చుట్టూ వివదాలు ఆగడం లేదు. తాజాగా భూమా అఖిలప్రియపై భూమా కిషోర్‌రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *