ఏపీలో మహిళలకు త్వరలోనే ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. ఆగస్ట్ 12వ తేదీన ఆర్టీసీ, రవాణాశాఖపై చంద్రబాబు సమీక్షిస్తారని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుపైనా చంద్రబాబు చర్చిస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం త్వరలోనే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ, రవాణాశాఖలపై సమీక్షించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఈ విషయాన్ని అధికారులతో పంచుకున్నారు. అయితే ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు చేస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి ముందు సీఎం రివ్యూ జరగనుండటంతో అదే రోజు నుంచి పథకం అమలుచేస్తారా అనే ఆసక్తి నెలకొంది.మరోవైపు.. రవాణాశాఖపై నిర్వహించిన సమీక్షలో కొంతమంది అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారంటూ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అలాగే చౌకబియ్యం అక్రమ రవాణా చేస్తుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇక అక్రమంగా ఇసుక, మైన్స్ రవాణా చేస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడం పైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే ఒకే నంబరుతో అనేక వాహనాలు తిరుగుతున్నాయన్న మంత్రి.. అలాంటి వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేలా వ్యవహరించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపైనా మంత్రి అధికారులతో చర్చించారు.
ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ సంస్థలో సిబ్బంది కొరత గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విధినిర్వహణలో సిబ్బంది చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే కారుణ్య నియామకాలలో జాప్యం జరగకుండా చూడాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు.