Varalakshmi Vratam 2024 ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది..పూజా విధానం, శుభ ముహుర్తం ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి…

Varalakshmi Vratam 2024 హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్ష ఆచరించిన వారికి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఈరోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వివాహిత మహిళలు తమ భర్త, పిల్లల భవిష్యత్తుకు సంబంధించి సంతోషకరమైన జీవితం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నిష్టలు, నియమాలు, మడులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేస్తారో వారందరికీ శుభ యోగం కలిగి, అమ్మవారి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది.. శుభ ముహుర్తం.. విశిష్టతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ ఏడాది 16 ఆగస్టు 2024 శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు.
సింహ లగ్న పూజా ముహుర్తం : ఉదయం 5:57 గంటల నుంచి ఉదయం 8:14 గంటల వరకు(మొత్తం వ్యవధి 2 గంటల 17 నిమిషాలు)
వృశ్చిక రాశి పూజా ముహుర్తం : మధ్యాహ్నం 12:50 గంటల నుంచి మధ్యాహ్నం 3:08 గంటల వరకు(మొత్తం వ్యవధి 2 గంటల 19 నిమిషాలు)
కుంభ లగ్న పూజా ముహుర్తం : సాయంత్రం 6:55 గంటల నుంచి రాత్రి 8:22 గంటల వరకు(మొత్తం వ్యవధి 1:17 నిమిషాలు)
వృషభ లగ్న పూజా ముహుర్తం : అర్ధరాత్రి 11:22 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 1:18 గంటల వరకు(మొత్తం వ్యవధి 1:56 నిమిషాలు)

వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి తలస్నానం చేయాలి. ఈ పవిత్రమైన రోజున కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలనే ధరించాలి. ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా గదిలో కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. పూజకు వాడే వస్త్రం కాటన్‌దే అయ్యుండాలి. పాలిస్టర్ లేదా సింథటిక్ దుస్తులను ధరించి పూజించొద్దు. అమ్మవారిని స్మరించుకుంటూ ఉపవాస దీక్షను ప్రారంభించాలి. ముందుగా ఒక చెక్క స్తంభాన్ని తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి, లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలి. అనంతరం లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కొన్ని అక్షింతలు ఉంచి దానిపై నీటితో నింపిన కుండను అమర్చాలి. అనంతరం వినాయకుడు, లక్ష్మీదేవికి నెయ్యితో దీపారాధన చేయాలి. పూజ ప్రారంభమయ్యాక మంత్రాలను పఠించాలి. పూజా సమయంలో వరలక్ష్మీ వ్రత కథను పఠించాలి.

పూజ చేసేందుకు కలశాన్ని జాకెట్ పీస్‌తో అలంకరించాలి. అనంతరం పసుపు, కుంకుమ, గంధం కలిపిన మిశ్రమంతో స్వస్తిక్ చిహ్నం వేయాలి. కలశంలో బియ్యం లేదా నీరు, నాణేలు, ఐదు రకాల ఆకులతో పాటు తమలపాకులు నింపాలి. చివరగా మామిడాకులను కలశంపై ఉంచాలి. ఆ తర్వాత కొబ్బరికాయకు పసుపు రాసి దానిపై ఉంచాలి. అనంతరం అమ్మవారిని అలంకరించాలి. పూజలో భాగంగా ఐదు రకాల పండ్లు, నైవేద్యాన్ని సమర్పించాలి. వ్రతం నిర్వహించిన రోజున సాయంత్రం హారతి కూడా ఇవ్వాలి.

వర మహాలక్ష్మీ వ్రతం చేసేవారంతా ఈ మంత్రాలను జపించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ‘‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభయో నమః’’ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతారు. అంతేకాదు మీ కుటుంబం, మీ భాగస్వామి ఆయువు కూడా పెరుగుతుందని నమ్ముతారు.

స్కంద పురాణంలో ఈశ్వరుడు వరలక్ష్మీ వ్రతం ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి వివరించారు. ప్రతి ఒక్క మహిళ సకల ఐశ్వర్యాలను, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించాలని పార్వతీ దేవి కోరగా.. శివయ్య వరలక్ష్మీ వ్రతం మహత్యం గురించి చెప్పాడు. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల సుమంగళ యోగం కోరుకునే స్త్రీలకు శుభ ఫలితాలొస్తాయని వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే.. సద్గుణాలు కలిగిన చారుమతి గురించి చెబుతాడు. తన భర్త పట్ల ఎంతో ప్రేమ, అత్తమామల పట్ల గౌరవం ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీ దేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలతో ఉన్న చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరమహాలక్ష్మీ కలలో కనిపించి శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తనను కొలిచిన వారికి కోరిన కోరికలన్నీ తీరుస్తానని అభయమిస్తుంది. అప్పటినుంచి అమ్మవారి ఆదేశాల మేరకు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సకల సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీదేవికి వివరించారు. అప్పటినుంచి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించి, వరమహాలక్ష్మీ అనుగ్రహం పొందాలని పెద్దలు చెబుతారు.

గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. 

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *