మంటల్లో జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్‌.. అంతర్జాతీయ సమాజం ఆందోళన

ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కర్మాగారంలో మంటలు చెలరేగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన‌ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. దీనిపై రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రష్యా సైన్యమే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ఈ చర్యకు తెగబడ్డారని ఆయన మండిపడ్డారు. అటు, ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన శతఘ్నుల వల్లే మంటలు వ్యాపించాయని మాస్కో ప్రత్యారోపణలు చేసింది.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్‌ చోటుచేసుకోలేదని, ఆ ప్రదేశానికి తమను అనుమతించాలని ఐఏఈఏ సిబ్బంది కోరారు. కాగా, జపోరిజియా అణువిద్యుత్తు కేంద్రానికి సంబంధించిన కూలింగ్‌ టవర్‌లో ఆదివారం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న రష్యా నియమిత గవర్నర్‌ యూవ్‌గెవ్‌నీ బాలిటెస్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ సైన్యాలు వాటిని సోమవారం నాటికి పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయని ఆయన తెలిపారు.

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ అణుకేంద్రాన్ని తమ అధీనంలోకి తీసుకొన్నాయి. దీంతో రెండేళ్ల నుంచి ఇక్కడ విద్యుదుత్పత్తిని నిలిపివేయగా.. రియాక్టర్లను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కోల్డ్‌ షట్‌డౌన్‌లో ఉంచారు. తాజాగా ఈ ప్లాంట్‌ కూలింగ్‌ టవర్‌పై డ్రోన్‌ దాడి జరిగిన వీడియోను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిపుణులు ఎక్స్‌లో షేర్ చేశారు.

ఉక్రెయిన్ దళాలు కుర్స్క్‌లోని నైరుతి ప్రాంతంలోకి ప్రవేశించినట్టు రష్యా ధ్రువీకరించింది. రష్యా భూభాగంలోని 30 కిలోమీటర్ల మేర ట్యాంకులు, సాయుధ దళాలతో చొచ్చుకొచ్చినట్టు మాస్కో తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ దాడిని తిప్పికొడుతున్నామని పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు క్షిపణులను కూల్చివేసినట్టు కుర్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెక్సీ స్మిర్‌నోవ్ తెలిపారు. 300 బలగాలు, 11 యుద్ధ ట్యాంకులు, 20కిపైగా సాయుధ వాహనాలతో రాత్రికి రాత్రే ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని అన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సరిహద్దు చొరబాటు ఇదే కావడం గమనార్హం. ఆ ప్రాంతంలోని 76 వేల మందికిపైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు రష్యా తరలించింది. గత రెండున్నరేళ్లుగా సాగుతోన్న యుద్ధం మరో మలుపు తిరిగింది.

About amaravatinews

Check Also

ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..

హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్‌ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *