ప్రస్తుతం సోషల్ మీడియాలో పరిస్థితి ఎలా తయారైందంటే.. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి. నిజానిజాలు పక్కనబెడితే కొన్ని వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. వాస్తవం సంగతి దేవుడెరుగు.. ఆసక్తికరంగా అనిపించిందే తడవుగా ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ చేసేస్తుంటారు కొందరు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని.. పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవం అన్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆగస్ట్ 15వ తేదీకి పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవం అని నామకరణం చేశారంటూ కొంతమంది వీడియోలు వైరల్ చేస్తున్నారు.
వాస్తవం ఏమిటంటే?
అసలు నిజం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం అని వేర్వేరుగా అన్నారు. అయితే పూర్తి వీడియోలోని కొంచెం భాగాన్ని మాత్రమే కట్ చేసి.. ఈ రకంగా వైరల్ చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో పంచాయతీలకు నిధులు కేటాయిస్తూ ఇటీవలే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి పదివేలు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి 25 వేలకు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ పవన్ కళ్యాణ్ వీడియో విడుదల చేశారు. ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. నిర్వహణకు గానూ పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.
ఏపీలో ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారన్న పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు ఇవ్వనున్నట్లు వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవంతో పాటుగా జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకుందామని పవన్ కళ్యాణ్ వీడియోలో అన్నారు.
అయితే వీడియోలో పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం పదాలు పక్కపక్కనే ఉండటంతో.. ఆ భాగాన్ని మాత్రమే కట్ చేసి.. కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ అనని విషయాన్ని అన్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. పంద్రాగస్టుతో పాటుగా గణతంత్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుందామని పవన్ కళ్యాణ్ చెప్తే.. పంద్రాగస్టు అంటే గణతంత్ర దినోత్సవం అని పవన్ కళ్యాణ్ అన్నారంటూ వైరల్ చేస్తున్నారు. అదీ అసలు సంగతి..