వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇంఛార్జ్ నియామకం.. మరి సజ్జల భార్గవ రెడ్డి సంగతేంటి!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీచేసి కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఈ దారుణమైన ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు ఆళ్ల నాని, శిద్దా రాఘవరావు.. మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరి, కిలారి రోశయ్యలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నరసింహయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇలా ఒక్కొక్కరు పార్టీని వీడటం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.

ఈ పరిణామాలతో వైఎస్సార్‌‌సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఇటీవల పార్టీపై ఫోకస్ పెట్టారు. ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలోని జగన్ నివాసానికి తరలించారు.. ఇకపై అక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ను మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఆ స్థానంలో కొత్తవారిని నియమించారు.. ఈ మేరకు సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ కొత్త సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనను నియమించినట్లు అశోక్ రెడ్డి అనే పార్టీ నేత ట్వీట్ చేశారు. తనను వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా నియమించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అశోక్ రెడ్డికి పార్టీ కేడర్, నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే అశోక్ రెడ్డి అమెరికాలో ఉంటున్నారు.. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. మరి ఆయన అక్కడే ఉండి పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలను చక్కబెడతారా.. ఏపీకి వచ్చేస్తారా అన్నది చూడాలి.

మరోవైపు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా అశోక్‌రెడ్డిని నియమిస్తే.. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న సజ్జల భార్గవరెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఆయన సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఈ కీలక అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద వైఎస్సార్‌సీపీ అధిష్టానం పార్టీ బలోపేతంతో పాటూ సోషల్ మీడియాలో దూకుడు పెంచే దిశగా కొత్త ఇంఛార్జ్‌ను నియమించిందనే చర్చ జరుగుతోంది. త్వరలో మరికొన్ని మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. అలాగే జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవుల్ని కూడా త్వరలో భర్తీ చేయాలని భావిస్తున్నారట.. జిల్లాల వారీగా కేడర్‌తో చర్చించి ఆ మేరకు నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *