తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒక్కరోజులోనే, సరికొత్త రికార్డు

తిరుమల శ్రీవారి హుండీకి చాలా రోజుల తర్వాత కాసుల వర్షం కురిసింది. కొన్ని నెలల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది.. చాన్నాళ్లకు స్వామివారి హుండీ ఆదాయం ఒక్క రోజులో రూ.5కోట్ల మార్కును దాటేసింది. బుధవారం తిరుమల శ్రీవారిని 72,967మంది భక్తులు దర్శించుకున్నారు.. 32,421మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే 5.26 కోట్లు ఆదాయం సమకూరింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్డీ టికెట్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. వీకెండ్‌తో పాటూ వరుసగా దాదాపు ఐదు రోజుల పాటూ సెలవులు రావడంతో తిరుమలలో రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ రద్దీ వచ్చే బుధవారం వరకు కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి.

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ముందుగా సాయంత్రం సేనాధిపతివారిని ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా వసంతమండపానికి వేంచేపు చేశారు. అనంతరం మృత్సంగ్రహణం, ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అంకురార్పణ కారణంగా బుధవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

About amaravatinews

Check Also

తిరుమల రూపురేఖలు మారబోతున్నాయి.. త్వరలోనే, టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు

తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్‌ టౌన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు టీటీడీ ఈవో జే శ్యామలరావు. తిరుపతిలోని పరిపాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *