మాజీ మంత్రి రోజాకు చిక్కులు.. రంగంలోకి సీఐడీ, ఆ మాజీ మంత్రి కూడా!

మాజీ మంత్రి రోజా చిక్కుల్లో పడ్డారు.. గత వైఎస్సార్‌‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. సీఐడీకి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్‌ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలయ్యాయి. ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడలశాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అప్పటి అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో సీఐడీ స్పందించింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఐడీ ఆదేశించగా.. సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు రూ.150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని.. భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఆడుదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్న సమయంలోనే క్రికెట్‌ బ్యాట్లు విరిగిపోయోయాయి.. దీంతో ఆ కిట్ల నాణ్యతలో డొల్లతనం బయటపడింది. ఈ అంశంపై అప్పట్లోనే చర్చ జరుగుతోంది.

అంతేకాదు ఆడుదాం ఆంధ్ర జర్సీల కొనుగోళ్ల నుంచి ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడలశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ, వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని? క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని? వాటిలో నాణ్యత తదితర అంశాలపై విచారణ చేయనున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం సీఐడీ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విమర్శలు వచ్చాయి. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు గత ప్రభుత్వం తెలిపింది. ఆ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో ఎవర్ని విజేతలుగా ప్రకటించాలని అప్పటి అధికార పార్టీ నేతలే నిర్ణయించారనే విమర్శలు వచ్చాయి. అయితే నిధుల్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు సిద్ధమైంది. త్వరలోనే దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఆరోపణలపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

About amaravatinews

Check Also

కార్తీక పౌర్ణమి రోజున ఈ రెమెడీస్ చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదల వర్షం కురుస్తుంది..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కార్తీక పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం విశేషంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *