తాను దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ స్పందించారు. ఉదయం నుంచి తనపై కొన్ని మీడియా ఛానెళ్లలో, టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో తాను పారిపోయేందుకు ప్రయత్నించానంటూ ప్రచారం జరుగుతోందని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు. పారిపోవాల్సిన అవసరం, ఖర్మ తనకు పట్టలేదన్నారు. రెండు నెలలుగా విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు పారిపోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తాను తప్పుచేశానని భావిస్తే.. కోర్టు తీర్పును దమ్ముతో తీసుకుంటానన్నారు. అంతేకానీ టీడీపీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడి పారిపోయే రకం తాను కాదన్నారు.
గతంలో చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్లు ఎగరవేసిన సమయంలో, గురజాలలో టీడీపీ కార్యకర్తల పరామర్శ, ఛలో ఆత్మకూరు సమయంలో మిగతా టీడీపీ నాయకుల మాదిరిగా తాను పారిపోలేదన్నారు. ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు. తన తండ్రి దేవినేని నెహ్రూ తనకు జన్మనివ్వటంతో పాటుగా ధైర్యంగా బతకడం కూడా నేర్పించారని.. ఈ విషయాన్ని టీడీపీ సోషల్ మీడియా తెలుసుకోవాలన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలూ అందుబాటులో ఉంటానంటూ వీడియో రిలీజ్ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని దేవినేని అవినాష్ కోరారు.
మరోవైపు గురువారం రాత్రి దేవినేని అవినాష్ హైదరాబాద్ నుంచి దుబాయి వెళ్లేందుకు ప్రయత్నించారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే మంగళగిరి పోలీసులకు సమాచారం ఇస్తే.. పోలీసులు అనుమతి ఇవ్వొద్దని సూచించినట్లు వార్తలు వచ్చాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవనేని అవినాష్ మీద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దని ఇమ్మిగ్రేషన్ అధికారులకు, మంగళగిరి పోలీసులు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవటంతో అవినాష్ వెనక్కి వెళ్లారంటూ ఉదయం నుంచి కథనాలు వెలవడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తానెక్కడికీ పారిపోలేదంటూ దేవినేని అవినాష్ క్లారిటీ ఇచ్చారు.