ప్రస్తుత సమాజం చాలా కమర్షియల్‌గా మారిపోయింది. ఎంతగా అంటే.. డబ్బుల కోసం సొంతవాళ్లను కూడా దూరం చేసుకునేంత. రక్తసంబంధానికి కూడా విలువ లేకుండాపోతోంది. దూరం చేసుకుంటే పర్లేదు కానీ.. అందరి ముందు అవమానించి.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి.. తలదించుకునేలా చేయటమే శోచనీయం. అలాంటి అమానుష ఘటనే జరిగింది సిద్దిపేటలో. ఇచ్చిన అప్పులో కొంత మొత్తం తిరిగి ఇవ్వలేదన్న కోపంతో.. సొంత అన్నావదినపై దాడి చేయటమే కాకుండా.. వీధిలోకి లాగి ఆలయానికి కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు.
నాసర్‌పూర్‌కి చెందిన పరిశురాములు తన అవసరాల నిమిత్తం.. తన సొంత తమ్ముడు కనకయ్య వద్ద 8 నెలల క్రితం లక్షా 20 వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. కాగా.. కొద్దిరోజుల తరువాత తాను తీసుకున్న మొత్తంలో లక్ష రూపాయలు తిరిగి చెల్లించాడు. అయితే.. మిగిలిన 20,000లతో పాటు వడ్డీ కూడా ఇవ్వాలని కనకయ్య డిమాండ్ చేశాడు. కాగా.. ప్రస్తుతం తన దగ్గర లేవని.. తర్వాత ఇస్తానని తమ్ముని చెప్పాడు పరుశురాములు. అలా కుదరదని.. తనకు మొత్తం డబ్బులు ఇప్పుడే కావాలని అన్నతో గొడవకు దిగాడు కనకయ్య. ఈ క్రమంలోనే.. అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగి గొడవ జరిగింది.
గొడవలో భాగంగా.. కోపంతో ఊగిపోయిన కనకయ్య.. తన అన్న పరుశురాములుపై చేయి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా.. మూర్ఖంగా ఆలోచించి.. అదే ప్రాంతంలో ఉన్న ఉన్న హనుమాన్ ఆలయం ప్రాంగణానికి అన్నావదినను తాళ్లతో కట్టేశాడు. స్థానికులు ఎంతగా సముదాయించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కనకయ్య మాత్రం వినలేదు. దీంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. పరుశురాములు, అతని భార్యను విడిపించారు. బాధితుల ఫిర్యాదుతో.. సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కనకయ్యపై కేసు నమోదైంది. కేవలం 20,000 రూపాయల కోసం.. సొంత అన్నను, వదినను.. ఇలా అందరి ముందు అవమానపర్చటంపై స్థానికులు కనకయ్యను తిట్టి పోస్తున్నారు. మరికొందరు.. డబ్బులపై వ్యామోహంతో తోడబుట్టిన అన్నను కూడా ఇలా చేస్తారా అన్న ఆశ్చర్యంతో ముక్కునవేలేసుకుంటున్నారు.