నలుగురి ప్రాణం తీసిన కలుషితాహారం.. రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషితహారం తిని నలుగురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. చనిపోయినవారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడిన చంద్రబాబు.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. అలాగే చనిపోయిన నలుగురు విద్యార్థుల కుటుంబసభ్యులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఇప్పటికే హోం మంత్రి వంగలపూడి అనిత, విద్యశాఖ మంత్రి నారా లోకేష్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయమై అధికారులకు సూచనలు చేస్తున్నారు.

మరోవైపు అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలంలో ఉన్న కైలాసపట్నంలో పేద పిల్లల కోసం ఓ మత సంస్థ ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు చెందిన పిల్లలు ఈ ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే శనివారం పిల్లల కుటుంబసభ్యులకు ఈ ఆశ్రమంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే భోజనాల తర్వాత కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమోసాలు తిన్న తర్వాత సుమారు 27 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడినట్లు తెలిసింది. వీరిలో సోమవారం నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

కలుషితాహారం తిని భవాని, జాషువా, శ్రద్ధ, నిత్య అనే నలుగురు విద్యార్థులు చనిపోయారు. మిగతా 23 మంది విద్యార్థులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి, అనకాపల్లి, విశాఖ కేజీహెచ్ ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు. 14 మంది నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని అనకాపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కోటఉరట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *