టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సూపర్ హిట్ చిత్రాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే మలయాళంలో కూడా ఈ ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది. తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆల్ టైమ్ హిట్ మూవీ ‘మణిచిత్రతాళు’ (చంద్రముఖి ఒరిజినల్)ను థియేటర్లలో రీరిలీజ్ చేశారు. ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసిన ఆడియన్స్ వారి రియాక్షన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇందులోని ఓ సీను గురించి మాట్లాడుకోక తప్పదు.
నేషనల్ అవార్డు తెచ్చిన సీను
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించింది. అయితే 1993లో రిలీజైన ఈ మణిచిత్రతాళు చిత్రానికి గాను ఉత్తమ నటిగా శోభన అప్పట్లోనే అవార్డు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతలా శోభన ఇందులో ఏం యాక్ట్ చేసిందో తెలుసుకోవాలంటే ఈ ఒక్క సీన్ చూస్తే చాలు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్‌కి చాలా మందికి చంద్రముఖి సినిమా గురించి.. అందులో చంద్రముఖి పాత్రలో జ్యోతిక నటన గురించే తెలుసు. కానీ ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి కానీ ఒరిజినల్ వెర్షన్ అయిన మణిచిత్రతాళులో నాగవల్లి పాత్రలో శోభన నటన అద్భుతం. అలా అని జ్యోతిక యాక్టింగ్‌ను తక్కువ చేస్తున్నట్లు కాదు. కానీ ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినల్‌యే.