Elon Musk Optimus: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్. ఈయన సంపద బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఏకంగా 245 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయనకు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ సంపద 201 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎప్పుడూ చిత్రవిచిత్ర ప్రకటనలు చేసే ఎలాన్ మస్క్.. ఇప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు మస్క్ నేతృత్వంలోని దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా వినూత్న ఉద్యోగ అవకాశం ప్రకటించింది. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హత అల్లా.. టెక్నాలజీ వాడకంపై అవగాహన సహా రోజుకు 7 గంటలు నడవగలిగే సామర్థ్యం ఉండాలి. ఇక వీరికి ఆఫర్ చేసిన జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే. గంటకు 48 డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ. 4 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇలా రోజుకు 7 గంటల లెక్కన చూస్తే దాదాపు రూ. 28 వేల వరకు సంపాదించుకోవచ్చు.
టెస్లా.. ఆప్టిమస్ పేరిట హ్యూమనాయిడ్ రోబో తయారు చేస్తోంది. దీనికి శిక్షణ ఇచ్చేందుకు.. ఇందుకోసం వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి నియమించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. ఆప్టిమస్‌కు శిక్షణ ఇచ్చేందుకు ఉద్యోగులు కావాలని ప్రకటన ఇచ్చింది.
టెస్లా ఈ ఉద్యోగం పేరును డేటా కలెక్షన్ ఆపరేటర్‌గా పేర్కొంది. మోషన్ క్యాప్చర్ సూట్, వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్ ధరించి నిర్దేశిత మార్గాల్లో నడవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ 7 గంటల చొప్పున పని చేయాలి. సమాచారం సేకరించడం ఇంకా దానిని విశ్లేషించగల సామర్థ్యం ఉండటం, సమగ్ర రిపోర్టులు రాయడంతో పాటు ఈ క్రమంలోనే చిన్న పరికరాల్ని వినియోగించవలసి ఉంటుంది. ఇంకా ఈ ఉద్యోగం కోసం కొన్ని శారీరక ప్రమాణాల్ని కూడా కలిగి ఉండాలి. ఎత్తు 5’7” నుంచి 5’11” వరకు ఉండాలి. ఇంకా 13 కిలోల బరువు మోయగలిగే సామర్థ్యం ఉండాలి.
అనుభవం, నైపుణ్యం సహా నిర్వర్తించబోయే విధుల్ని బట్టి ఈ ప్యాకేజీ మారుతుంటుంది. వేతనం గంటకు 25.25 డాలర్ల నుంచి 48 డాలర్ల మధ్య ఉంటుంది. డెంటల్, విజన్ బీమా, మెడికల్, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. ఇంకా ఈ ఉద్యోగంలో షిఫ్ట్స్ కూడా ఉంటాయి. టెస్లా కెరీర్ పేజీలో ఉద్యోగ సంబంధిత పూర్తి వివరాలు ఉంటాయి.