JanDhan: సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ యోజనకు శ్రీకారం చుట్టింది. 2014, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. బ్యాంకు సేవలు అందని వారికి, వెనకబడిన వర్గాలకు దీని ద్వారా బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని, లోన్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఈ ఖాతాలు తీసుకొచ్చింది. ఈ పథకం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతోంది. పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద కొత్తగా 3 కోట్ల అకౌంట్లు తెరిచే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద 2015 మార్చిలో 14.72 అకౌంట్లు ఉండగా.. అది 2024, ఆగస్టు 16వ తేదీ నాటికి 53.13 కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అకౌంట్ల కింద మొత్తం డిపాజిట్లు సైతం గణనీయంగా పెరిగాయి. జన్ ధన్ ఖాతాల్లో 2015 మార్చి నెలలో రూ.15,670 కోట్లు ఉండగా.. అది 2024 ఆగస్టు నాటికి రూ.2.31 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. జన్ ధన్ అకౌంట్ తెరిచేందుకు, నిర్వహణకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు. అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా ఛార్జీలు ఉండవు. ఈ ఖాతాల ద్వారా రూ. 2 లక్షల ప్రమాద బీమా ఉంటుంది. అలాగే ఉచిత రూపే డెబిట్ కార్డును సైతం అందిస్తారు.