ఏపీ కేబినెట్‌ భేటీలో పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రస్తావన.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం, పవన్ కళ్యాణ్ బర్త్ డే అంశాలను ప్రస్తావించారు. సెప్టెంబరు ఒకటో తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 ఏళ్లవుతోందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు. వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం, జన్మభూమి, ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది.

ఆ తర్వాత సెప్టెంబరు 2న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినమని మంత్రి దుర్గేష్‌ గుర్తు చేశారు. పవన్‌కు ముందస్తుగా మంత్రివర్గం శుభాకాంక్షలు తెలిపింది. వెంటనే స్పందించిన చంద్రబాబు.. పవన్‌ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటారని.. బహుశా ఆరోజు ఆయన తనకు కూడా అందుబాటులో ఉండరేమోనని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 30న జరిగే వనమహోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు.

అంతేకాదు కేబినెట్ భేటీ ఎజెండాలోని అంశాలు ముందుగానే న్యూస్ ఛానళ్లకు తెలుస్తున్నాయన్నారు చంద్రబాబు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు, ఓటాన్‌ ఎకౌంట్‌ వివరాలు కూడా ముందుగానే లీకయ్యాయని కొందరు మంత్రులు ప్రస్తావించారు. ఇలా కీలకమైన సమాచారం ఎలా బయటకు వెళుతోందని.. కొన్ని శాఖల్లో ఇంకా పాతవాసనలు పోలేదని, క్రమశిక్షణ అవసరముందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

మరోవైపు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాల్లోకి వెళుతున్నారని.. అధికారం ఉందనే గర్వం సరికాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి సహించేది లేదని.. ఎంతో కష్టపడి, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తెచ్చుకున్న మంచి పేరును కొందరు చెడగొడుతున్నారని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే అన్నారు. మంత్రులు అప్రమత్తంగా ఉంటూ.. జిల్లాల్లోని ఎమ్మెల్యేలను కూడా గైడ్ చేయాలని సూచించారు. వివాదాలు, ప్రవర్తన సరిగా లేని ఎమ్మెల్యేలను తాను పిలిచి మాట్లాడతానన్నారు. అంతేకాదు మంత్రులకు వందరోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు చంద్రబాబు.

మరోవైపు వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీలు టీడీపీలో చేరడంపైనా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎవరొచ్చినా తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నారు. అది కూడా పదవులకు రాజీనామా చేస్తే వారి వ్యక్తిత్వాలను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. టీడీపీ బలోపేతం కోసం ఎవరి అవసరమైనా ఉందనుకుంటే వారిని తీసుకుంటామన్నారు. పార్టీలోకి రావాలనుకుంటున్న నేతల నియోజకవర్గాల్లో.. స్థానిక టీడీపీ నేతల మనోగతాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

About amaravatinews

Check Also

ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది

బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్‌ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *