యాచారం ఫార్మాసిటీ ఉన్నట్లా? లేనట్లా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల పరిధిలో 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు భూసేకరణ కూడా చేపట్టింది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ సేకరించిన భూముల్లో గ్రీన్ సిటీ టౌన్‌షిప్‌లు అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది.

తాజాగా.. ఈ ఫార్మా భూములు విషయంలో హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఫార్మాసిటీ ఉన్నట్లా..? లేనట్లా..? రాతపూర్వక వివరణ ఇవ్వలంటా హైకోర్టు రేవంత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 6వ తేదీకల్లా రాతపూర్వకంగా వివరాలు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫార్మాసిటీ ఏర్పాటుకు సేకరించిన భూముల పరిహార అవార్డు చెల్లదంటూ గతంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తమ భూములపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ యాచారమం మంటలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఎ.జంగయ్యతో పాటు మరో 48 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సింగిల్‌ జడ్జి తీర్పు నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసినట్లు మీడియా ఛానెళ్లు, న్యూస్ పేపర్లలో కథనాలు వచ్చాయని, అందువల్ల రైతుల భూములపై విధించిన ఆంక్షలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆ భూములను విక్రయాలు, వారసులకు అప్పగించడంతోపాటు రైతుబంధు, పంట రుణాలు పొందడానికి అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఈ వాదనలతో ఏకీభవించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.దివ్య తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు పూర్తి వాస్తవాలను వెల్లడించలేదని చెప్పారు. భూసేకరణ అవార్డు రద్దుపై న్యాయస్థానంలో ఇంకా విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ జోక్యం చేసుకుంటూ అసలు ఫార్మాసిటీ ఉందా ? రద్దయిందా? అన్న అంశాన్ని అధీకృత అధికారి వెల్లడించాలన్నారు. ఆ తరువాత పిటిషన్‌ పూర్వాపరాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు రాతపూర్వక హామీ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.


About amaravatinews

Check Also

అమ్మ బాబోయ్.. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి..! పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది. పాదముద్రల ఆధారంగా పులి కదలికను పసి గడుతున్నారు అటవీశాఖ సిబ్బంది. ట్రాప్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *