కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై మాజీ ప్రిన్సిపల్ ప్రొ. సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సందీప్ ఘోష్‌పై సీబీఐ తరఫు లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తవ్వితీయాల్సిన అవసరం ఉందని వివరించారు. సందీప్ ఘోష్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. 8 రోజుల కస్టడీ విధించింది. అనంతరం విచారణను సెప్టెంబరు 10కి వాయిదా వేసింది.
ఈ కేసులో సందీప్ ఘోష్‌తోపాటు మరో ముగ్గురు.. బిప్లవ్ సింఘా, సుమన్ హజారా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు ఈ బంధంలో భాగమేనని, ఇంకా ఎక్కువ మంది ప్రమేయం ఉందని సీబీఐ న్యాయవాది రాంబాబు కనోజియా కోర్టుకు తెలిపారు. ‘ఒక పెద్ద ముఠాయే ఉంది, ఇందుకు సంబంధించిన ఆధారాలను వెలికితీయాలి’ అని లాయర్ చెప్పాడు. కాగా, ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ అఫ్సర్ ఆలీ ఖాన్ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తొసిపుచ్చింది.
మరోవైపు, కోర్టు ముందు హాజరుపరిచిన సమయంలో సందీప్ ఘోష్‌పై పలువురు దాడికి యత్నించారు. ఆ సమయంలో 12 మంది సీబీఐ అధికారులు, 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ఆయనన్ను వారి బారి నుంచి రక్షించడానికి నానా తంటాలు పడ్డారు. కోర్టులో మహిళా న్యాయవాదులు రెండుసార్లు చెంప చెల్లుమనిపించారు. వందలాది మంది ఆందోళనకారులు అక్కడకు చేరుకుని, ‘దొంగ.. దొంగ’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అటు, సందీప్ ఘోష్ తరఫున హాజరైన లాయర్.. కస్టడీని తగ్గించాలని కోరారు. బెయిల్ పిటిషన్ వేయని ఆయన.. తన క్లయింట్ విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. ఆయన అరెస్టైన రోజున కూడా సీబీఐ ఆఫీసుకు వెళ్లారని, సమన్లు జారీచేసిన ప్రతి సందర్భంలోనూ విచారణకు హాజరయ్యారని వివరించారు.