ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రుల పేషీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లోకి కొత్తగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్‌లను తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీ) ప్రకటన విడుదల చేసింది. 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను, 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్‌లను నియమించబోతున్నట్లు తెలిపారు. వీరిని అవుట్‌సోర్సింగ్/తాత్కాలిక విధానంలో మంత్రులు పేషీల్లోకి తీసుకుంటారు. ప్రభుత్వం సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి విద్యార్హతను బీఈ/బీటెక్‌గా నిర్ణయించింది.. వీరికి నెలకు రూ.50 వేల జీతం ఇస్తారు. అదే సోషల్ మీడియా అసిస్టెంట్‌కి విద్యార్హతను ఏదైనా డిగ్రీ కాగా.. వీరి జీతం నెలకు రూ.30 వేలు.
ఏపీ ప్రభుత్వం ఈ 48 పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదల చేయగా.. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్.. డిజిటల్ కంటెంట్, ప్రమోషన్‌లో అనుభవం ఉండాలని తెలిపింది. ప్రధానంగా మంత్రుల పోర్ట్‌ఫోలియోకు సంబంధించి కార్యకలాపాలు, ప్రభుత్వ బ్రాండ్‌ను పెంచేలా కంటెంట్‌ని రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే లేటెస్ట్ రెజ్యూమేను (info.apdcl@gmail.com) మెయిల్ ఐడీకి పంపాలని సూచించారు. ఈనెల 23వ తేదీ వరకు అవకాశం ఉంది.
సోషల్ మీడియా అసిస్టెంట్స్.. గతంలో సోషల్ మీడియా వింగ్స్‌లో పనిచేసిన అనుభవం ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఫ్రీలాన్స్ డిజిటల్ బ్లాగర్ ప్లాన్, ఫేస్‌బుక్, గూగుల్ అనలిటిక్స్, హాట్ సూట్‌పై పనిచేసిన అనుభవం ఉండాలని చెప్పారు. వీరు కూడా లేటెస్ట్ రెజ్యూమేను (info.apdcl@gmail.com) మెయిల్ ఐడీకి పంపించాలని సూచించారు. దీనికి కూడా ఈనెల 23వ తేదీ వరకు అవకాశం ఉంది. ఈ 48 పోస్టుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు.. ఆ తర్వాత అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. అప్పుడు వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
మెయిల్ పంపించేవారు ఒకే పీడీఎఫ్ ఫైల్‌లో డాక్యుమెంట్లను పంపాలని సూచించారు. అలాగే సాఫ్ట్, స్కాన్ కాపీని జతచేయాలని.. అలాగే 5 MB కంటే ఎక్కువ సైజులో పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు సంతకం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇతర సర్టిఫికేట్లు పంపాల్సి ఉంటుంది. ఎవరికైనా మరిన్ని వివరాలు తెలియాలంటే.. ప్రభుత్వ వెబ్‌సైట్లు https://www.apdc.ap.gov.in/ , I&PR వెబ్‌సైట్ http://ipr.ap.gov.in/ చూడాలని సూచించారు.