ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొత్తానికి రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ చెల్లించబోతోంది. అమరావతి రైతులకు కౌలు నిమిత్తం ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది. ఆ నిధుల్ని సీఆర్డీఏకు విడుదల చేస్తూ పాలనాపరమైన అనుమతులు కూడా జారీ చేశారు. అంతేకాదు అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది.
మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది. ఐదేళ్లుగా నీళ్లలో ఉంటూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్ఠతపై చెన్నై, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఆ భవనాల పునాదులపై అధ్యయనం చేసిన ఆ రెండు ఐఐటీల నిపుణుల బృందాలు ప్రాథమిక నివేదికను అందజేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో తుది నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది.
అమరావతిలో మొదలైన హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల పునాదులు ఐదేళ్లుగా నీటిలో ఉన్న సంగతి తెలిసిందే.
ఆ భవనాల పునాదుల్ని పరీక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే చెన్నై ఐఐటీ నిపుణులు ఇటీవల ఆ భవనాల పునాదుల్ని పరిశీలించారు. ఆ భవనాల పునాదుల నుంచి కొంత భాగాన్ని కత్తిరించి తీసుకెళ్లి పరీశీలించారు.. పటిష్టతపై అధ్యయనం చేశారు. ఈ భవనాలు, పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని.. అయితే ఐదేళ్లుగా బయటకు కనిపిస్తూ తుప్పు పట్టిన ఇనుమును తొలగించి, కెమికల్ ట్రీట్‌మెంట్ చేసి భవన నిర్మాణాలు మళ్లీ కొనసాగించొచ్చని ఐఐటీ నిపుణులు ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భవనాలతో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, ఇతర ఉద్యోగుల కోసం వివిధ దశల్లో ఉన్న భవనాల పటిష్ఠతపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం ఈ భవనాలను పరిశీలించి.. వాటికి కూడా ఎలాంటి ఇబ్బందిలేదని, మళ్లీ నిర్మాణాలు కొనసాగించవచ్చని ఆ బృందం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.