ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. బెంగళూరు-పుట్టపర్తి ప్యాసింజర్ రైలు (06515/06516)ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాసింజర్ రైలును పుట్టపర్తి వరకు కాకుండా అనంతపురం వరకు పొడిగించినట్లు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి నిత్యం బెంగళూరుకు రాకపోకలు ఉంటాయి.. ఇప్పుడు ఈ రైలును అనంతపురం వరకు పొడిగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు పుట్టపర్తితో పాటుగా బెంగళూరుకు వెళ్లేందుకు రైలు సౌకర్యం కల్పించాలని అంబికా లక్ష్మీనారాయణ రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. అందుకే ఈ ప్యాసింజర్ రైలును అనంతపురం వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి రైలును పొడిగించారని.. రెండు, మూడు రోజుల్లో ప్యాసింజర్ రైలు అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ప్యాసింజర్ రైలు.. బెంగళూరు రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 8.15 గంటలకు బయలుదేరి పుట్టపర్తి స్టేషన్‌కు 11.45 గంటలకు చేరుకుంటుంది. ఆ తర్వాత ధర్మవరం రైల్వే స్టేషన్‌కు మధ్యాహ్నం 12.35 గంటలకు.. అనంతపురం స్టేషన్‌కు 1.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. అనంతపురం నుంచి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి బయలుదేరి.. ధర్మవరం 3 గంటలకు, పుట్టపర్తి 3.30 గంటలకు చేరుతుంది.. అక్కడి నుంచి బయల్దేరి బెంగళూరుకు రాత్రి 7.30 గంటలకు చేరుకుంటుందని వెల్లడించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
మరోవైపు అనంతపురం జిల్లా మీదుగా నడిచే వందేభారత్ రైళ్లపై రాళ్ల దాడులు కలకలంరేపాయి. ఈ నెల 14న బెంగళూరు-కలబురిగి 22231/32 (గుల్బర్గా) వందేభారత్‌పై కల్లూరు సమీపంలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో సీసీ ఫుటేజీలు ఏవీ గుర్తించలేదు.. వాస్తవానికి సీసీ కెమెరాల్లో అంతా రికార్డు కావాల్సి ఉంది.. కానీ ఎవర్నీ గుర్తించలేకపోయారు. అంతకముందు కాచిగూడ- యశ్వంతపూర్ రైలుపై రాళ్ల దాడి జరిగింది.. గతేడాది నవంబరు 17న (రైలు ప్రారంభించిన రెండు నెలలకే) అనంతపురం నగర శివారులోని లెక్చలర్స్ కాలనీ దగ్గర ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ యువకుడ్ని సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు. వందేభారత్ రైలుకు సెక్యూరిటీని కల్పిస్తున్నామంటున్నారు రైల్వే పోలీసులు. ఒకవేళ ఎక్కడైనా రాళ్లు విసిరితే సీసీ ఫుటేజీ ద్వారా నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేస్తామని.. కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం జిల్లా మీదుగా రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. రెండిటిపైనా రాళ్లదాడి జరగడం చర్చనీయాంశం అయ్యింది. ఒక ఘటనలో నిందితుడు దొరికిపోగా.. మరో ఘటనలో నిందితుడ్ని అరెస్ట్ చేయాల్సి ఉంది.