లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా జరిగిన పేజర్ పేలుళ్ల వెనుక ఇజ్రాయేల్ స్కెచ్ ఉన్నట్టు వెల్లడయ్యింది. మొత్తం 5 వేలకుపైగా పేజర్లు పేలిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా… దాదాపు 3 వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయేల్ గూఢచర్య సంస్థ మొసాద్ పక్కా ప్లానింగ్‌తో దాడి చేసింది. పేలిపోయిన పేజర్లు తైవాన్‌లో తయారుకాగా.. కొద్ది నెలల కిందటే హెజ్బొల్లా గ్రూప్ ఆర్డర్ చేసిందని లెబనాన్‌కు చెందిన భద్రతా వర్గాలు రాయిటర్స్‌కు వివరించాయి. ఈ ఆపరేషన్ కోసం మొసాద్ కొద్ది నెలలుగా కార్యాచరణ చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
హెజ్బొల్లాను దెబ్బతీయడానికి మొసాద్ పక్కాగా ప్లాన్ చేసి నిర్వహించిన ఆపరేషన్ ఇదని సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి. కొంతకాలంగా పేజర్ల ద్వారానే హెజ్బొల్లా సభ్యుల మధ్య సమాచార మార్పిడి జరుగుతోంది. మొబైల్ ఫోన్లు వాడొద్దని, ఇజ్రాయేల్ నిఘా సంస్థలు ట్రాప్ చేసే అవకాశం ఉందని తన సభ్యులకు హెజ్బొల్లా చీఫ్ హెచ్చరించారు. దీంతో ఆ గ్రూప్ పేజర్లపైనే ఆధారపడుతోంది. ఇటీవల తైవాన్ నుంచి 5 వేల పేజర్లను కొనుగోలు చేసి సభ్యులకు అందజేసింది. ఇక్కడే ఇజ్రాయేల్ గూఢచర్య సంస్థ చురుకుగా ఆలోచింది.