ఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ అమెరికా కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాను విచారణకు చేపట్టిన అమెరికా కోర్టు.. భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. సదరన్ న్యూయార్క్ డిస్ట్రిక్ట్ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు.. భారత ప్రభుత్వం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రిసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ సమత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాలకు సమన్లు జారీ అయినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. భారత ప్రభుత్వంతో పాటు సమన్లు జారీ అయినవారంతా 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అమెరికా కోర్టు సమన్లపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
దావావేసిన పన్నూ.. కోర్టు ఉత్తర్వులను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. గత నవంబరులో గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు పన్నిన కుట్రను అమెరికా చేధించినట్టు యూకేకు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. సిఖ్స్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థ చీఫ్ అయిన పన్నూన్‌కు అమెరికా, కెనడా పౌరసత్వం ఉంది. కాగా, కుట్రను చేధించిన విషయాన్ని కొద్ది రోజుల తర్వాత బైడెన్ యంత్రాంగం ధ్రువీకరించింది. ఈ ఆరోపణలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, ఉన్నతస్థాయి విచారణను ప్రారంభించామని పేర్కొంది.